తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. విద్యుదాఘాతంతో ఓ థర్మాకోల్ ప్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీగా మంటలు ఎగసిపడుతుండడం వల్ల.. అదుపులోకి రావడం లేదు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకుంటున్నాయి.
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామపంచాయతీ పరిధిలో లక్ష్మి ఈపీఈ (పాలీఇథిలిన్) పరుపులకు ఉపయోగించే థర్మాకోల్ పరిశ్రమ గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతోంది. ఇవాళ విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ లోపల 25 ఎల్పీజీ సిలిండర్లు ఉండడంతో పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవి పేలిపోయే ఆస్కారం ఉండడం వల్ల గౌరారం నుంచి మర్కుక్ వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ఘటనా స్థలిలో ఏసీపీ నారాయణ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి ఇదే మార్గంలో వెళుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అగ్నిప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం పరిశ్రమ యజమానిని పరామర్శించి వెళ్లిపోయారు.
ఇదీచూడండి: Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి