Minister Buggana: అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కొవిడ్ వల్లే ఈ పరిస్ధితులు వచ్చాయని వివరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆదుకుంటూనే.. రాష్ట్రాన్ని సుస్థిర ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో నేర్పుగా నడిపిస్తున్నట్లు తెలిపారు.
కొవిడ్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అనుమతించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్న ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు. 2021 మార్చి 31 నాటికి ప్రజాపద్దు కింద 3 కోట్ల 55 లక్షల 874 కోట్లు రుణాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
2020-21లో కేంద్రంతో పోల్చితే ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువే ఉన్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
తెదేపా నేతలది గోబెల్స్ ప్రచారం..
Minister Buggana slams TDP: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై తెలుగుదేశం పార్టీ నేతలను మంత్రి బుగ్గన ఖండించారు. వారి ఆరోపణలు సరికావని.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతలు చేస్తోన్నదంతా గోబెల్స్ ప్రచారమేనని అన్నారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వ పాలనలో 2019-20 లో వృద్ధిరేటు పెరిగిందని.. కరోనాతో మధ్యలో వృద్ధిరేటు తగ్గినా ఇప్పుడు సానుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పును మిగిల్చిందన్న మంత్రి.. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నిబంధనల మేరకే అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన అప్పులు పంచి, ఆస్తులు మాత్రం ప్రాంతీయ ప్రాతిపదికన పంచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని బుగ్గన ఆరోపించారు. గత ప్రభుత్వం పరిధికి మించి అప్పులు చేయడం వల్లే 2021-22 ఏడాదిలో రుణపరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు.
ఇదీ చదవండి:
పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్- ఆర్టీసీ కండక్టర్ ఘనకార్యం!