రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై తెలుగుదేశం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కరోనా సంవత్సరాన్ని కలిపి... లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కంటే ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23శాతం వృద్ధి అయ్యిందన్నారు. వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. 2020-21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో రాష్ట్రానికి 3వ ర్యాంకు వచ్చిందన్నారు. పేదరికంలో ఏపీని... 6 నుంచి 2వ స్థానానికి చేర్చామని ప్రతిపక్ష నేతలు చెప్పడం పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. నీతీఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని వివరించారు.
ప్రతిపక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు దాచిపెట్టి, తెలుగుదేశానికి అనుకూలమైన లెక్కల చెప్పి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు వ్యవసాయ రంగ అభివృద్ధి పట్టడం లేదని.. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు వ్యవసాయ రంగాన్ని ఏవిధంగా హేళన చేశారో... ప్రతి పక్షంలో ఉన్నా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని కుట్రలు చేయడం దురదృష్టకరమన్నారు. విపక్ష నేతలు నైతిక విలువలను మరచి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనుకోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. ప్రతి పక్ష నాయకులు ప్రజలకు నిజాలు చెప్పి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చూడండి: IYR KRISHNARAO: 'తితిదే బోర్డు నియామకాల్లో రాజకీయాలు..!'