రాష్ట్రంలో ఎరువు కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పొటాష్, డీఏపీ దొరకట్లేదు. షాపులకు వెలితే సరఫరా లేదంటున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఎరువుల సంస్థలు ఉత్పత్తి తగ్గించి.. అరకొర కేటాయింపులే చేస్తున్నాయి. వచ్చేదే తక్కువ, ఇందులో 50% రైతుభరోసా కేంద్రాలకే (ఆర్బీకేలు) కేటాయిస్తున్నారు. నగదు చేతిలో ఉన్నవారికే అక్కడ కొనే అవకాశం ఉంటుంది. అరువుపై ఆధారపడి సాగే వ్యవసాయంలో.. రైతులు అధికభాగం దుకాణదారుల నుంచే ఎరువులు, పురుగుమందుల్ని అప్పుపై తెచ్చుకుంటారు. వీటికి సరఫరా తక్కువగా ఉంది. ప్రాథమిక సహకార పరపతి సంఘాలకూ అంతంతగానే కేటాయిస్తున్నారు. అక్కడా రైతులకు ఎరువులు దొరకట్లేదు. ఉత్తరాంధ్రలో కొన్ని పీఏసీఎస్‌ల వద్ద రైతులు బారులు తీరుతున్నారు.
నిల్వలు లేవు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డీఏపీ కొరత ఉంది. మాగాణి సాగు అధికంగా ఉండే ప్రాంతాల్లో పొటాష్ దొరకట్లేదు. గులాబ్ తుపాను నేపథ్యంలో.. దెబ్బతిన్న పంటలపై వీటిని చల్లాలని అధికారులు సిఫారసు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నిల్వలు దాదాపు పూర్తిగా నిండుకున్నాయి. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ డ్యాష్‌బోర్డు లెక్కల ప్రకారం గురువారం ఉదయానికి రాష్ట్రవ్యాప్తంగా పొటాష్, డీఏపీ నిల్వలు 49వేల టన్నులు ఉన్నాయి. ఇందులో కొంతమేర గతంలోనే విక్రయించినా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. నికరంగా 40వేల టన్నుల వరకు ఉంటాయని అంచనా. పొటాష్ 30వేల టన్నులు, డీఏపీ 30 వేల టన్నులే మార్కెట్లో ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో 250 టన్నుల లోపే పొటాష్ నిల్వలు ఉన్నాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొటాష్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కర్నూలు జిల్లాలో డీఏపీ దొరకడం లేదు. ఎక్కడైనా కొద్దిపాటి నిల్వలు ఉన్నా.. బస్తాపై రూ.150 నుంచి రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. ‘రెండెకరాల్లో వరి వేశాం.. ఇప్పుడు పొటాష్ చల్లాలి.. ఎక్కడా లేవంటున్నారు’ అని విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం రైతు సీతారాం వాపోయారు. ‘8 ఎకరాల్లో వరికి పొటాష్ వేయాలి.. దుకాణాల చుట్టూ తిరుగుతున్నా’ అని గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘అయిదెకరాల్లో వరికి.. మొదటి విడతగా డీఏపీ చల్లేందుకు అష్టకష్టాలు పడ్డా. ఇప్పుడు 5 రోజుల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నా’ అని బాపట్ల మండలం నర్సాయపాలెం రైతు వెంకటేశ్వరరావు చెప్పారు.
డీఏపీకి డిమాండు..
కేంద్ర రాయితీ నేపథ్యంలో డీఏపీ ధర బస్తా (50కిలోలు) రూ.1,200 చొప్పున నిర్ణయించారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువులపై నియంత్రణ లేదు. అంతర్జాతీయంగా ముడిసరకు ధరలు పెరగడంతో.. వీటికి రెక్కలు వచ్చాయి. 28-28, 14-35-14 తదితర ఎరువుల ధరలు రూ.1,525పైనే ఉన్నాయి. దీంతో వాటికి బదులు ఎక్కువమంది డీఏపీ వేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే సమయంలో తయారీ సంస్థలు ఖర్చులు భరించలేక డీఏపీ ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో రాష్ట్రాలకు వచ్చేదే తక్కువగా ఉంది. పొటాష్ ధరలూ గత నెలలోనే భారీగా పెరిగాయి. ప్రస్తుతం బస్తా రూ.1,040 వరకు చేరింది.
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
ఉత్తరాంధ్రలో పొటాష్ కొరత ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. గులాబ్ తుపానుతో పొటాష్ అవసరం పెరిగింది. కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. అనుమతి రాగానే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అవసరాలకు కేటాయిస్తాం. డీఏపీ కొరత ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. విచారించి తగిన చర్యలు తీసుకుంటాం.-అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
ఇదీ చదవండి: tirumala: శ్రీవారికి రోజూ ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా..!