పట్టణ ప్రాంతాల పేదలకు ఇళ్లను నిర్మించే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలతోపాటు సామాజిక సౌకర్యాల కల్పన కింద ప్రభుత్వం 18 రకాల వసతులను కల్పించనుంది. అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, రైతుబజార్లు, జనతాబజార్లు, డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు తదితరాలను నిర్మించనున్నారు. మొదటి విడతగా 15.10 లక్షల ఇళ్ల నిర్మాణానికిగాను ఎంపికచేసిన 8,925 లేఅవుట్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆయా లేఅవుట్లలో ఉన్న జనాభా, వాటి సమీపంలో అందుబాటులో ఉన్న వసతుల ఆధారంగా కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి రూ.2,715 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 8,925 లేఅవుట్లకుగాను 7,176 చోట్ల 100లోపు ఇళ్లనే నిర్మిస్తారు.
ఏమేం ఏర్పాటు చేస్తారంటే..
* ఆయా లేఅవుట్లలో 3,587 అంగన్‌వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్), 3,587 ప్రాథమిక, 61 ఉన్నత పాఠశాలలు, 34 ఇంటర్, ఒక డిగ్రీ కళాశాలను నిర్మించనున్నారు.
* 771 గ్రామ సచివాలయాలు, 209 వార్డు సచివాలయాల ఏర్పాటు అవసరమని గుర్తించారు.
* 639 విలేజ్ క్లినిక్‌లు, 43 ప్రాథమిక/పట్టణ ఆరోగ్యకేంద్రాలు, 5 సీహెచ్‌సీలు అందుబాటులోకి తేనున్నారు.
* 22 గ్రంథాలయాలు, 721 రైతు భరోసా కేంద్రాలు, 771 జనతాబజార్లు, 31 రైతుబజార్లు, 72 చొప్పున డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు ఏర్పాటు చేయనున్నారు. 165 పాల శీతలీకరణ కేంద్రాలు, పది దుకాణాలు ఉండేలా 3,061 వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: కొలువుతీరిన పంచాయతీ నూతన పాలక వర్గాలు