ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced exam) కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఉదయం జరిగిన పేపర్-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అధిక శాతం మంది విద్యార్థులు గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, రసాయనశాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగాను, భౌతికశాస్త్రం మధ్యస్తంగానూ ఉన్నాయని శ్రీచైతన్య జేఈఈ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. మొత్తంమీద సగటు విద్యార్థికి ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారదా విద్యాసంస్థల నిపుణుడు విఘ్నేశ్వరరావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒక్కో పేపర్ 180 మార్కులకు...
ఈసారి ఒక్కో పేపర్ 180 మార్కులకు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 19 చొప్పున ఒక్కో పేపర్‌లో 57 ప్రశ్నలిచ్చారు. ప్రతి సబ్జెక్టులో మళ్లీ నాలుగు సెక్షన్లుగా విభజించి నాలుగు రకాల ప్రశ్నలిచ్చారు. గత ఏడాది 396 మార్కులకు అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ఆయా విద్యార్థుల ఓఎంఆర్ పత్రాన్ని(రెస్పాన్స్ షీట్) ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ప్రాథమిక కీను 10వ తేదీన వెల్లడిస్తామని ఐఐటీ ఖరగ్‌పుర్ తెలిపింది. ఈనెల 15న ఫలితాలు విడుదల చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ఆ మరుసటి రోజు నుంచే ఐఐటీలు, ఎన్‌ఐటీలకు కలిపి సంయుక్తంగా జోసా కౌన్సెలింగ్ మొదలవుతుంది.
ఇదీ చదవండి