గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహించిన ఎస్పీబీకి నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బాలుకు భారతరత్న కోరుతూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలు, సంస్థలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని కోరారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు చరిత్రపై తనదైన శైలిలో చెరగని ముద్రవేశారన్నారు. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీ, గాయకులను తీర్చిదిద్దారని.. తన పాటల ద్వారా ఎంతోమందికి మానసిక స్వాంతన అందించారని కొనియాడారు. అంతర్జాలంలో 74 రోజులపాటు బాలు సంగీతోత్సవాలు నిర్వహిస్తామని వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు ప్రకటించారు.
కళాభారతి, డాక్టర్ జమునా రమణారావు, సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు, నేపథ్య గాయని జమునారాణి, సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, వీణాపాణి, కేఎం రాధాకృష్ణన్, సినీ గేయ రచయితలు భువనచంద్ర, వెన్నెలకంటి, వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ నగేష్ చెన్నుపాటి, ప్రవాస భారతీయులు, తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాళ్లూరి, ఎన్ఏటీఎస్ అధ్యక్షులు శేఖర్ అన్నే, భరత్ మందాడి, ఎస్. నరేంద్ర, ఆళ్ల శ్రీనివాస్, మ్యూజిక్ వరల్డ్ రాజేష్ శ్రీ బాలుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఇదీ చదవండి: నటి సోఫియా రికార్డు.. ఒకే ఏడాదిలో రూ.315 కోట్లు