తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య. ఒక్కసారి రాజకీయ నేతగా ఎదిగితేనే నాయకుల జీవనశైలి మారిపోతుంది. అలాంటిది ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినా.. తన సాధారణ జీవితాన్ని వదిలేయలేదు.
ఎక్కడికి వెళ్లాలన్న ఈ మాజీ ఎమ్మెల్యే వాహనం.. సామాన్యుడి రథం సైకిలే. సైకిల్ మీదే కిలోమీటర్ల కొద్ది ప్రయాణించి నియోజకవర్గ ప్రజల సాదకబాధకాలు తెలుసుకునే వారు. సైకిల్‌పైనే పార్టీ సమావేశాలు, ప్రచారాలకు వెళ్లేవారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. నాలుగో సారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత.. పార్టీ నుంచి మోటార్ బైక్, జీపు వచ్చాయి. అయినా తనకు సైకిల్‌పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ దాన్నే ఉపయోగించేవారు. 63 ఏళ్ల వయస్సులోనూ ఆయన.. అప్పుడప్పుడు సైకిల్‌పైనే షికారుకు వెళ్తుంటారు.
శారీరకంగా దృఢంగా ఉండేందుకు సైకిల్ పై ప్రయాణం ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి తెలిపారు. సైకిల్.. రవాణాకు ఉపయోగకరమే కాకుండా, ఇంధన ఆదాకు ఉపయుక్తమైనదని చెప్పారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం (World Bicycle Day) సందర్భంగా.. సైకిల్ అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వీలైనంత వరకూ సైకిల్‌పై వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు.
ఇదీ చదవండి:
Anandaiah Medicine: 3 నెలల తర్వాతే.. ఆనందయ్య చుక్కలమందు..!