వైకాపా ప్రభుత్వం రాద్ధాంతం చేసిన అనవసర నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంచి ముగింపు ఇచ్చారని భాజపా నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ ఆదేశించడం మంచి పరిణామంగా అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించి, హైకోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రభుత్వం నాలుగు నెలలుగా ఎస్ఈసీ తొలగింపుపై నానాయాగి చేసిందన్నారు. హైకోర్టు రెండు సార్లు, సుప్రీంకోర్టులో మూడు సార్లు ఎదురుదెబ్బ తగిలినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు.
ఈ వ్యవహారం మొత్తం కరోనాతో మొదలైంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడంతో... ప్రభుత్వం ఆయనను తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సంస్కరణల పేరు ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ఎస్ఈసీ పదవీకాలం తగ్గించి రమేశ్ కుమార్ ను తొలగించారు.- కామినేని శ్రీనివాస్, భాజపా నేత
ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశాలు సరిగా లేవన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడిపై దృష్టిపెట్టకుండా... నాలుగు నెలలుగా వృథా ప్రయాస చేసిందన్నారు. మహమ్మారిని నివారించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని గమనించి రాష్ట్రం కూడా అదే మార్గంలో నడవాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను విస్మరించి అనవసర ప్రయత్నాలు...ఎస్ఈసీ, సీఆర్డీఏ, మూడు రాజధానులు, 26 జిల్లాలపై దృష్టి పెడుతుందని ఆరోపించారు. గవర్నర్ ఇచ్చిన ఈ ఆదేశాలతోనైనా ప్రభుత్వం తన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి : అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..