employees protest on prc: పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాలని ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంఘాలు నిరసనలు చేపట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక పంపుల చెరువు, ఆర్టీసీ డిపో వద్ద ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాడేరు డివిజన్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని నినదించారు. సీపీఎస్ రద్దు చేయాలని విన్నవించారు. డీఎ వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరారు.
కర్నూలులో..
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. విధులకు వెళ్తున్న ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలను ఇస్తూ నిరసన తెలిపారు. కర్నూలు జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సైతం అడ్డుకొని నిరసనకారులు ఆందోళన చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనుగంచిప్రోలు జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఉపాధ్యాయ సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉద్యమం ఆగదు..
employee protest on prc: ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని విశాఖలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
మొక్కుబడిగా సమావేశాలు
సానుకూల స్పందన లేక ఉద్యమానికి పిలుపునిచ్చామని కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని.. ఇప్పటికీ వచ్చేనెల 6 వరకు సమయమిచ్చామని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగజేయవద్దనే సంయమనం పాటిస్తున్నామన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే అడుగుతున్నామని.. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మొక్కుబడి సమావేశాలతో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. కనీసం పీఆర్సీ నివేదిక ఎందుకు బయటపెట్టలేదు. నివేదిక ఇవ్వనివాళ్లు... పీఆర్సీ ప్రకటిస్తారని అనుకోవాలా. కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థంకాని పరిస్థితి నెలకొంది.- ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఇదీ చూడండి:
Amaravati Padayatra: కర్షక జాతరలా పాదయాత్ర.. నేడు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశం