Power Cut In AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అధికారులు విద్యుత్ నిలిపేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గటంతో 3 డిస్కంల పరిధిలో కోతలు విధిస్తున్నారు. వీటీపీఎస్, ఆర్టీటీపీ, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల్లో 1700 మెగావాట్ల మేర ఉత్పత్తి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 3 గంటలకు పైగా విద్యుత్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చీరాలలో సాయంత్రం 6.30 నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 2 గంటలుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాకినాడ జీజీహెచ్ మినహా మిగతా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. తుని, సీతానగరం, అమలాపురం, రామచంద్రపురం డివిజన్లు, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదీ చదవండి