లాక్‌డౌన్‌తో వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు మూతపడడంతో సాధారణ విద్యుత్తు వినియోగం సుమారు 25 శాతం తగ్గింది. దీంతో గత మూడు నెలల్లో రూ.3 వేల కోట్ల విలువైన విద్యుత్తు అమ్మకాలు తగ్గాయి. విక్రయాలు తగ్గినా నిబంధనల మేరకు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు స్థిర ఛార్జీలను పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో డిస్కమ్‌లు కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ఆర్థిక సర్దుబాటు కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాల మేరకు ఏటా స్థిర ఛార్జీల రూపేణా రూ.9 వేల కోట్లను డిస్కంలు చెల్లించాలి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.1,500 కోట్లు, ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, జెన్‌కోకు రూ.7,500 కోట్లను స్థిర ఛార్జీల కింద చెల్లించాలి. పారిశ్రామిక, వాణిజ్య, గృహ వినియోగదారుల నుంచి గరిష్ఠ డిమాండ్ (ఎండీ) ఛార్జీల రూపేణా ఏటా రూ.6 వేల కోట్లు మాత్రమే వసూలవుతున్నాయి. మిగిలిన మొత్తాన్ని చర ఛార్జీల (విద్యుత్తు వినియోగం ఆధారంగా వసూలు చేసే బిల్లులు) నుంచి డిస్కంలు సర్దుబాటు చేస్తున్నాయి. విద్యుత్తు సంస్థలకు అధిక ఆదాయాన్నిచ్చే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్తు వినియోగం లాక్‌డౌన్‌తో సుమారు 4 వేల మిలియన్ యూనిట్లు తగ్గింది. ఫలితంగా కరెంటు విక్రయాలు తగ్గాయి. స్థిర ఛార్జీలను మాత్రం డిస్కంలు భరించాల్సి వస్తోంది.
రూ.6,600 కోట్ల కొత్త రుణాలు
కరోనా నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి కేంద్రం రూ.90 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను డిస్కంల తరఫున కేంద్రమే నేరుగా చెల్లించనుంది. ఈ ప్యాకేజీలో రూ.6,600 కోట్ల రుణాలను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ హామీ కోసం ప్రతిపాదనలను పంపారు.
నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాం
కరోనా నేపథ్యంలో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్తు వినియోగం తగ్గింది. కానీ డిస్కంలు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు తగ్గకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. నష్టాలను తగ్గించుకోటానికి బహిరంగ మార్కెట్‌లో చౌక విద్యుత్తు కొనుగోళ్లపై దృష్టి సారించాం.
- శ్రీకాంత్, ట్రాన్స్‌కో సీఎండీ
ఇదీ చదవండి: