రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏ ఒక్క విద్యార్థీ కింద కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. మార్చి 4 నుంచి 23వ తేదీ వరకూ ఇంటర్.. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వివరించారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఇంటర్ పరీక్షల కోసం 1,411 కేంద్రాలు, అలాగే పదో తరగతి పరీక్షల కోసం 2,923 కేంద్రాలను గుర్తించినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అలాగే పరీక్షా సమయంలో స్థానికంగా ఉండే జిరాక్సు సెంటర్లను మూసివేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఇన్విజిలేటర్లనూ జంబ్లింగ్ విధానంలోనే కేటాయిస్తామన్నారు. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిందిగా మంత్రి సూచించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రతీ హాల్ టికెట్‌ను క్యూఆర్ కోడ్‌తో జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు, కూర్చునే సీటు ఎక్కడ అనే విషయాన్ని ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ యాప్‌ను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలు పెడుతున్నామని మంత్రి తెలిపారు.
ఇంటర్ గ్రేడింగ్‌తో పాటు మార్కులు
మరోవైపు పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈసారి ఇంటర్లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే ఈ పరీక్షల కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనూ ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: