రాజధాని పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా గ్రామాలను ప్రత్యేకంగా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయటంతో పాటు కొన్ని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో కలిపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందుకే రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తుళ్లూరు మండలంలోని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ మొదలైంది. మంగళగిరి, తాడేపల్లి మండల పరిధిలోని గ్రామాలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి పురపాలికలో కలపాలని ప్రతిపాదించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని పేర్కొన్నారు. మిగిలిన గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, కొన్ని పురపాలికలు, నగరపాలికల్లో సమీప గ్రామాల విలీనానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాజధాని గ్రామాలను సైతం కొత్త కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కలపటంపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఎన్నికలు జరిగితే ఫలితాలు భిన్నంగా వచ్చే అవకాశం ఉన్నందున... అమరావతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విలీనం దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: