ఇన్నాళ్లూ శాంతియుతంగా జరిగిన అమరావతి నిరసనలు.. 65వ రోజు ఉద్రిక్తతగా జరిగాయి. మందడం రణరంగాన్ని తలిపించింది. బుధవారం కృష్ణాయపాలెంలో భూముల సర్వేకి వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతుల్లో... 426 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఆగ్రహంతో రోడ్డెక్కిన రైతులు... మందడం కూడలిలో బైఠాయించారు. ఎక్కడి వాహనాలను అక్కడే అడ్డుకునేలా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
అయితే ఇక్కడే గందరగోళం ప్రారంభమైంది. రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళలు, రైతులను పోలీసులు డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. రెండు మూడు సార్లు ఇళ్లపై డ్రోన్ తిరిగింది. అదే సమయంలో ఓ మహిళ స్నానం చేస్తూ డ్రోన్‌ను గమనించి కుటుంబసభ్యులకు చెప్పడంతో... వారు పోలీసులను ప్రశ్నించారు. చిత్రీకరించిన దృశ్యాలను చూపించాలని డిమాండ్ చేశారు. వాగ్వాదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు ఐకాస నాయకుడు సుధాకర్‌ను... పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. రైతులు అక్కడికి చేరుకుని సుధాకర్‌ను విడిపించారు.
అనంతరం మందడం కూడలిలో బైఠాయించిన రైతులు, మహిళలకు... తెదేపా, కాంగ్రెస్, సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో మహిళా న్యాయవాదులు, అమరావతి ఐకాస మహిళా విభాగం నేతలు పాల్గొన్నారు. ఇళ్లపై డ్రోన్ ద్వారా చిత్రీకరించేందుకు ఆదేశించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇతర ప్రాంతాల్లో యథావిధిగా అమరావతి పోరులో రైతులు పాల్గొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.... తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు. రైతుల ఉద్యమానికి ప్రజల ఆదరణను ఓర్వలేకే ప్రభుత్వం కేసుల పేరుతో అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి : పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ