online classes effect on eyes : ఆన్లైన్ తరగతులకు ముందు కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వంద మంది రోగుల్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఇరవై మంది పిల్లలే ఉంటున్నారు. వారిలో కనీసం ముగ్గురికి కళ్లజోడు తప్పనిసరి అవుతోంది. మిగిలిన వారిలో పొడిబారిన కళ్లు, మంటలు, మసక చూపు లాంటి సమస్యలు ఉంటున్నాయి. - హైదరాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు కంటి వైద్య నిపుణుల అభిప్రాయం
చిన్నారులు రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్‌చూస్తే కంటి చూపుతో పాటు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఇటీవల ఆన్‌లైన్ విద్యపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పాఠ్యాంశాలను తక్కువ నిడివితో వీడియోలుగా రూపొందిస్తే తేలికగా అర్థం కావడంతోపాటు కంటిపై ఒత్తిడి తగ్గుతుందని, అవసరమైతే మరోసారి వినే అవకాశం ఉంటుందని సూచించింది. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు బోధన చేపట్టగా సానుకూల ఫలితాలు కనిపించాయి.
కరోనా మొదటి దశ ఉద్ధృతి నేపథ్యంలో 2020 మార్చి నెలాఖరు నుంచి ఒక్కసారిగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఉపాధ్యాయుల ప్రత్యక్ష బోధనలు కంటికి, చెవికి దూరమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఎలక్ట్రానిక్ మాధ్యమాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వ విద్యా సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాయి. ఎక్కువ శాతం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మాత్రం ఆన్‌లైన్ తరగతులనే కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఆన్‌లైన్ తరగతులు కొనసాగించే విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా విద్యా సంస్థలు దాదాపు రోజూ రెండు నుంచి నాలుగున్నర గంటలకుపైగానే తరగతుల నిర్వహిస్తూనే.. వాట్సాప్, ఇతర మార్గాల్లో హోంవర్క్ తాలూకు వివరాలు పంపుతున్నాయి. ఇది విద్యార్థుల కళ్లపై తీవ్ర ప్రభావమే చూపుతోందని కంటి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘‘బడులు మూతపడటంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చేతపట్టుకున్నారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కొనిచ్చే స్థోమత లేని ఎక్కువ మంది సెల్‌ఫోన్‌లనే పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. చిన్నచిన్న ఎలక్ట్రానిక్ తెరలపై అక్షరాలను, చిత్రాలను పరికిస్తూ చూపు కదల్చకుండా తరగతులు విన్న ఎక్కువ మంది ఇప్పుడు దృష్టిలోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎదిగే వయసులో కళ్లపై పడుతున్న ఒత్తిడి దృష్టి సమస్యకు మూలకారణంగా మారుతోందని’’ వారు చెబుతున్నారు. కరోనా మూడో ఉద్ధృతి కారణంగా తెలంగాణ ప్రభుత్వం బడులకు సెలవులివ్వడంతో మళ్లీ అందరికీ ఆన్‌లైన్ అవస్థలు ఆరంభమయ్యాయని, ఈ తరుణంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని ఖమ్మం పట్టణానికి చెందిన కంటి వైద్య నిపుణులు జి.సుబ్బయ్య తెలిపారు.
ఈ సూచనలు పాటిస్తే మేలు
* తదేకంగా ఎలక్ట్రానిక్ తెరలను చూడటం కంటితోపాటు తల, మెడ నొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి.కాబట్టి ప్రతి 45 నిమిషాలకోసారి కంటికి పది నిమిషాల విశ్రాంతి ఇవ్వాలి.
* ఎ-విటమిన్ అధికంగా లభించే గుడ్డు, పాలు, క్యారెట్, బొప్పాయి, ఆకు కూరలు లాంటివి పిల్లలకు అధికంగా అందించాలి.
* చిన్నారులను తగినంత నిద్రపోనివ్వాలి.
* తరగతుల తర్వాత వీడియోగేమ్స్ లాంటివి ఆడేవాళ్లూ ఉంటారు. వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.
* పచ్చదనం ఉండే ప్రాంతాల్లో ఆటలు ఆడించాలి.
కళ్లు పొడిబారకుండా చూసుకోవాలి
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ తెరలను ఎక్కువ సమయం చూడటం వల్ల కంటిపాప అలసటకు గురవుతుంది. కంటిలోపల ఉండే పల్చని నీటిపొరపైనా ప్రభావం పడుతుంది. కొందరిలో ఇది ఎండిపోయే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి తరగతుల మధ్య కంటికి కొంత సమయం విశ్రాంతి తప్పనిసరి. విశ్రాంతి సమయంలో కంటిపై చల్లని వస్త్రం లేదా కీరదోస ముక్కలను ఉంచితే తేమ ఆరిపోకుండా చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు కంటికి మధ్య ‘పెద్ద స్కేలు (30 సెం.మీటర్లు)’ దూరం ఉండేలా చూసుకోవాలి. తెరల నుంచి నీలి కాంతి వస్తుంది కాబట్టి ఫిల్టర్ అద్దాలను అమర్చుకుంటే చాలా వరకు మేలు.-సి.అంజిరెడ్డి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు, హైదరాబాద్
పెద్ద తెరలు వినియోగించండి
సాధారణంగా 18 ఏళ్ల వరకు కంటి పాప(ఐబాల్) పెరుగుతుంది. ఆన్‌లైన్ తరగతులతో ఈ పెరుగుదలపై ప్రభావం పడుతోంది. ఇరవై శాతం మంది పిల్లల్లో ఏదో ఒక కంటి సమస్య వస్తోంది. ఒక్కసారి అద్దాలు వస్తే జీవితాంతం వాడాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతులు తప్పవు కాబట్టి చిన్న తెరల స్థానంలో పెద్ద తెరల వినియోగం పెంచాలి.
- వి. భాగ్యశేఖర్ గౌడ్, ప్రభుత్వ కంటి వైద్య నిపుణుడు, సంగారెడ్డి
ఇదీ చదవండి: విజయనగరంలో సైనిక్ స్కూల్ వజ్రోత్సవాలు.. ఆకట్టుకున్న విన్యాసాలు