తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఇల్లు మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తూ.. వైకాపా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎగువ నుంచి వరద వస్తోందన్న సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి గానీ, జలవనరుల శాఖ మంత్రి గానీ సమీక్షించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు వస్తున్నపుడు వాటి తరలింపుపై కనీస ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.
ఇదేం తీరు...
వరద నుంచి ముంపు గ్రామాల ప్రజలను కాపాడడంలో విఫలమైన అధికార పక్షం... ప్రతిపక్షంపై బురద జల్లేలా వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకు ప్రయత్నిస్తూ.. దాన్ని చంద్రబాబుపై నెట్టాలనునకోవటం దుర్మార్గమైన చర్యగా చెప్పారు.
దృష్టి మళ్లించేందుకే...
పోలవరం రీటెండరింగ్ విషయంలో అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలు, విద్యుత్ కొనుగోలు నిర్ణయాలపై జపాన్ రాసిన లేఖల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైకాపా నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుని ఆ ఇంటి నుంచి పంపించాలని తపిస్తున్నారే తప్ప.. ప్రజలను కాపాడాలనే విషయంలో ఏనాడైనా శ్రద్ధ చూపారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి