వ్యవసాయేతర భూ వినియోగ మార్పిడి విధాన నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ రెవెన్యూశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్ (నాలా) కింద జరిగే భూ వినియోగ మార్పిడిలో వివాదాలు తలెత్తితే ఇన్నాళ్లూ భూ పరిపాలన ప్రధాన కమిషనరుకు అప్పీలు చేసుకునేవారు. ఈ అధికారాన్ని తాజాగా జిల్లా అధికారులకు రెవెన్యూశాఖ బదలాయించింది.
వివాదాలపై తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) విచారించి.. నిర్ణయం ప్రకటిస్తారు. ఈ నిర్ణయం సంతృప్తికరంగా లేకుంటే జిల్లా కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చు. దీనిపై కలెక్టరు నిర్ణయమే అంతిమం. ప్రజాప్రయోజనాలుండి.. అనివార్య పరిస్థితులు తలెత్తితేనే కలెక్టరు నిర్ణయాన్ని భూ పరిపాలనా ప్రధాన అధికారి పునస్సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూ వినియోగ మార్పిడి ఫీజును ఇకపై మీసేవ ద్వారానే కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.
భూమి వినియోగ మార్పిడికి దరఖాస్తుల స్వీకరణ, విచారణ, నివేదికల సమర్పణలో అనుసరించాల్సిన విధివిధానాల గురించి స్పష్టత ఇచ్చారు. మీసేవ ద్వారా దరఖాస్తు అందగానే తహసీల్దారు విచారణ చేయించి నిర్ధారించిన అంశాలను ఆర్డీఓకి తెలియచేస్తే.. ఆయన పరిశీలించి ఆమోదం తెలుపుతారు. దీనికి అనుగుణంగా దరఖాస్తుదారుడికి ఆమోద పత్రాన్ని మీసేవ ద్వారా అందజేస్తారు. వివరాలు పక్కాగా రికార్డుల్లో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన తర్వాత వాటి వినియోగం ఎలా ఉందన్న దానిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: కర్నూలులోనే హెచ్చార్సీ కార్యాలయం.. ప్రభుత్వం ఉత్తర్వులు