ఇదీ చదవండి:
'ప్రజాతీర్పును వ్యతిరేకిస్తున్న మండలి రద్దు కావాల్సిందే' - మండలి రద్దుపై ధర్మాన వ్యాఖ్యలు
151 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో చర్చించి.. తీసుకొచ్చిన బిల్లులను పరోక్ష పద్ధతుల్లో ఎన్నికైన మండలి సభ్యులు అడ్డుకోవాలని చూస్తున్నారని వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ, అయ్యంగార్, కామత్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు సైతం ఎగువ సభను తిరస్కరించారన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం చేసిన నిర్ణయాలను... ప్రజలు తిరస్కరించిన వారు మండలిలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్న మండలి రద్దు ప్రతిపాదనను మద్దతిస్తున్నానన్నారు.
శాసనసభలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైకాపాను ప్రజలు గెలిపించారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో జరిగిన మండలి రద్దు తీర్మాన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజామోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైకాపా.. అభివృద్ధి వికేంద్రీకరణకు తీసుకొచ్చిన బిల్లులను శాసనసభలో చర్చించారన్నారు. అందరి సంక్షేమం కోసం తీసుకొచ్చిన బిల్లులను తెదేపా మండలిలో అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. మండలి చేస్తున్న పని.. ప్రజాతీర్పును వ్యతిరేకించినట్లేనన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని.. ప్రజలు తిరస్కరించిన వాళ్లు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎగువసభలు ఉన్నాయన్న ఆయన.. అవీ బ్రిటీషర్లు ఏర్పాటుచేసినవే అని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులెవరూ శాసనమండలిని సమర్థించలేదని స్పష్టం చేశారు. కొంతమంది సభ్యులు శాసనమండలిని ప్రభావితం చేస్తుంటే.. ఇంక మండలి విలువేముందన్నారు. మండలి ఛైర్మన్ ఒత్తిళ్లకు తలొగ్గి బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. అందుకే శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ధర్మాన చెప్పారు. ఎగువసభ ఉన్న ఉద్దేశం నెరవేరనప్పుడు ఆ సభ కొనసాగాల్సిన అవసరం లేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఇదీ చదవండి: