Land Pass Book:పట్టాదారు పాసుపుస్తకాలు లేక తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బాపల్లితండా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామంలోని ఏ వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. ధరణి రికార్డుల్లోనే ఈ ఊరు పేరిట భూముల్లేవు. ఏళ్లుగా రైతులు సాగులో ఉన్నా ధరణి రికార్డుల్లో నిక్షిప్తం కాలేదు. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు లేక రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అందడం లేదు.
పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క ఊరి రైతుల పేరిట పంటను అమ్ముకుని.. వాళ్లు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టాలు లేకపోవడం వల్ల పంటరుణాలు పొందలేకపోతున్నారు. భూముల్ని అమ్ముకుందామనుకున్నా.. పాసుపుస్తకాలు లేకపోవడంతో అమ్మడానికి వీలు లేకుండా పోయింది. 28 సర్వే నెంబర్లలో 549 ఎకరాలు సీలింగ్, 39 సర్వే నెంబర్లలో 350 ఎకరాలు పట్టా భూములున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో సాగులో ఒకరుంటే, దస్త్రాల్లో అదే సర్వే నెంబర్‌లో వేరొకరున్నారు. సాగులో ఉన్న భూవిస్తీర్ణానికి.. దస్త్రాల్లో ఉన్న భూవిస్తీర్ణానికి పొంతన లేదు. చిక్కుముడుల కారణంగా భూములు ధరణి రికార్డుల్లో నమోదు కాకుండా అధికారులు నిలిపేశారు. కొందరు వారే సాగు చేసుకుంటున్నా .. దస్త్రాల్లోనూ సరిగ్గానే ఉన్నా కూడా వారికి సైతం పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో అర్హులైన రైతులు ధరణి రికార్డుల్లో నమోదు కాకుండా అన్యాయానికి గురయ్యారు.
గ్రామస్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఇటీవలే మొత్తం భూమిని సర్వే చేసి నివేదిక సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. అదేవిధంగా భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా తప్పుగా ఉన్న దస్త్రాలను సరిచేయాలి. భూవివాదాల్ని పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాల్సిన రెవెన్యూ యంత్రాంగం బాపల్లితండా విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు సర్వే పూర్తి చేశారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు ఎప్పుడిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
"గత100సంవత్సరాల నుంచి భూములు సాగు చేసుకుంటున్నాం. మా తండాలో ఉన్న ఏ ఒక్క భూమికి పట్టాలు లేవు. తద్వారా రైతుబంధు, రైతుభీమా లేదు. పండించిన ధాన్యాన్ని వేరే వారి పేరు మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకు లోన్లు రావడం లేదు. ఇప్పటికి అనేక సార్లు సర్వేలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలి." -బాధిత రైతులు
ఇవీ చదవండి: