లైంగిక నేరాలకు పాల్పడే నేరగాళ్ల జాబితాను తయారు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, సీఐడీ, ఫోరెన్సిక్ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో డీజీపీ మాట్లాడారు. డయల్ 100, 112 లపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 2020 సంవత్సరాన్ని పోలీసుశాఖ పరంగా మహిళా మిత్ర సంవత్సరంగా పరిగణిస్తామన్నారు. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు వన్ స్టాప్ సెంటర్ను వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు. వారంలో కేసు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళా మిత్ర, సైబర్ మిత్రల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో ఆధారాలు సేకరించటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మహిళలు ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ వచ్చే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించాలని డీజీపీ తెలిపారు.
ఇదీ చదవండి :