రాజధాని అమరావతి ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నా కూడా.. జగన్ ప్రభుత్వం తెదేపా అధినేత చంద్రబాబుపై కక్షతో మూడు ముక్కలు చేస్తోందని, నాయకుల స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతిని బలిపెట్టడం దారుణమని.. దళిత ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దళిత ఐకాస ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల్లో చేపట్టిన దళిత చైతన్యయాత్ర ఆదివారం మూడో రోజుకు చేరింది. బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో యాత్ర కొనసాగింది. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, దళిత మహిళ ఐకాస కన్వీనర్ సువర్ణకమల, కో కన్వీనర్ చిలకా బసవయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. గాయకుడు రమణ బృందం ఉద్యమగీతాలను ఆలపించింది.
481రోజుకు చేరిన నిరసనలు
- మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు ఆదివారం 481వ రోజుకు చేరాయి. తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహం దగ్గర జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఐకాస నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. అమరావతి కొనసాగాలని కోరుతూ వెంకటపాలెం, మందడం, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమిలో సర్వమత ప్రార్థనలు, తుళ్లూరులో గీతాపారాయణం చేశారు.
ఇదీ చదవండి:
కృష్ణా, గోదావరి డయోసెస్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం