సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఓ సంస్థ భారీ మోసానికి గురైంది. సంస్థ మెయిళ్లను హ్యాక్ చేసి లావాదేవీలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన సైబర్ చోరులు ఏకంగా 66 లక్షల రూపాయల మేర బోల్తా కొట్టించారు. విజయవాడలోని వాల్విన్ అనే సంస్థ సీ ఫుడ్ వ్యాపారానికి సంబంధించి చైనాలోని వారితో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి సరుకుతో పాటే చెల్లించాల్సిన నగదు గురించి మెయిల్ వస్తుంది. అందుకు అనుగుణంగా డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అయితే... చైనా కంపెనీ తరపున మధ్యలో రహస్యంగా చొరబడిన సైబర్ దుండగులు... మరో బ్యాంకు ఖాతాలోకి నగదు వేయించుకున్నారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియన్ మోసంగా గుర్తించి... 33 లక్షల రూపాయలను సీజ్ చేయించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
సైబర్ 'మాయ'గాడు
మరో కేసులో వినియోగదారుల ఫోరం పేరుతో సైబర్ మాయగాడు 60వేల రూపాయల మేర ఓ యువతిని మోసగించాడు. యువతికి సాంకేతిక విషయాల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ... దుండగుడు నేర్పుగా బురిడీ కొట్టించాడు. ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దుస్తులు కొనుగోలు చేసిన యువతి కొన్ని కారణాల వల్ల తిప్పి పంపింది. అయితే.. సంబంధిత సంస్థ వాపసు తీసుకొనేందుకు నిరాకరించగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో బాధితురాలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. సమస్య పరిష్కరించే పేరుతో యువతితో మాట కలిపిన సైబర్ దుండగుడు నగదు కొల్లగొట్టాడు.
లాక్‌డౌన్ వేళ ఆన్‌లైన్ లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: