తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా తిరువూరులో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. కట్లేరు, ఎదుళ్ల వాగు, విప్లవ వాగు, పడమటి, తూర్పు వాగు, కొండ వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. మున్నేరులో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 14 అడుగులకు చేరింది. కృష్ణా నదికి 84,400 క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు.
అక్కపాలెం, వినగడప, కోకిలంపాడు, కొత్త లక్ష్మీపురం వద్ద వరదనీరు వంతెనలను తాకింది. తిరువూరు మండలం చౌటపల్లి వద్ద ఎదుళ్ల వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులతో గస్తీ ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షాలతో పెసర, మినుము, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదారి ఉగ్రరూపం
భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో భూములు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటిలో చిక్కుకున్న గేదెలు
పశ్చిమగోదావరిలో వర్షాల ధాటికి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలవరంలో స్పిల్వే వద్ద వరద ప్రవాహంలో పశువుల కాపర్లు గేదెలతో సహా చిక్కుకున్నారు. వీరిని పోలీసులు రక్షించారు. స్పిల్ ఛానల్ వద్ద వరద ప్రవాహం రాత్రికి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
నెల్లూరులో పంటనష్టం
అల్పపీడన ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వరి, వేరుశెనగ, మినుము పంటలు నీట మునిగాయి. దాదాపు 600 హెక్టార్లలో వరి.. 300 హెక్టార్లలో వేరుశెనగ, మినుము దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కోటి రూపాయలపైనే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెళ్లకూరు, డక్కిలి మండలాల్లో నూర్పిడి ధాన్యం వర్షానికి తడిసిపోయింది.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్రలో మూడ్రోజులపాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చన్నారు.
ఇదీ చూడండి: