CRDA Lands: రాజధాని అమరావతి పరిధిలోని నవులూరులో రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" అభివృద్ధి చేస్తోంది. టౌన్‌షిప్ తలపెట్టిన భూములు ప్రస్తుతం హడ్కో వద్ద తాకట్టులో ఉన్నాయి. తాకట్టులో ఉన్న 145 ఎకరాల భూముల్ని తనఖా నుంచి విడిపించాలంటే.. ఇప్పటికే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు హడ్కోకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. అందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా రాజధాని పరిధిలోని మరో ప్రాంతంలో 407 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం హడ్కో వద్ద తాకట్టు పెట్టింది. ఈమేరకు అనంతవరం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో ఉన్న 407.46 ఎకరాల భూమిని తనఖా రిజిస్ట్రేషన్ చేయించేసింది. అనంతవరంలో 200 ఎకరాలు, ఉద్దండరాయునిపాలెంలో 49 ఎకరాలు, మందడం పరిధిలో 157 ఎకరాలకు పైగా భూమి... హడ్కోకు తనఖా పెట్టినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం తనఖా పెట్టిన భూముల్లో కొన్నింటికి టైటిల్ డీడ్లు కూడా లేవు. అలాంటి భూములకు సంబంధించి CRDAతో రైతులు కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు, అగ్రిమెంట్లను టైటిల్ డీడ్లుగా చూపిస్తూ తనఖా రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. భూసమీకరణ విధానంలో కొందరు రైతులు కుదుర్చుకున్న 9.3, 9.14 ఒప్పంద పత్రాలను తనఖాలో పెడుతున్నట్టు రిజిస్ట్రేషన్ పత్రంలో సీఆర్డీఏ పేర్కొంది. రాజధాని ప్రాంతంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గతంలో 12వందల 75 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసిన హడ్కో.. అందులో 11వందల 51 కోట్లు ఇప్పటిదాకా విడుదల చేసినట్లు తెలిపింది. ఆ రుణం కోసం నవులూరు వద్దనున్న 145.59 ఎకరాలను అప్పట్లో తనఖా పెట్టారు. ఆ సొమ్ములు తిరిగి చెల్లించడానికి అవకాశం లేకపోవడంతో 145 ఎకరాలను విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా 407 ఎకరాలను తనఖా పెడుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: