CPM Leaders at Amaravati: అమరావతిని రాజధానిగా నిర్మించే వరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినయ్ విశ్వం తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఆగిన నిర్మాణాలను ఆయన సీపీఐ రాష్ట్ర నేతలతో కలసి పరిశీలించారు. అనంతరం తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ను నయా తుగ్లక్గా బినయ్ విశ్వం అభివర్ణించారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం కోసం రాజధాని రైతులు.. తమ ఆకాంక్షలు చంపుకోవాల్సిన పని లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయం సాధించిందన్నారు. అదేవిధంగా అమరావతి రైతులు కూడా విజయం సాధించేవరకు వారి వెంటే నడుస్తామని బినయ్ విశ్వం స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పు తర్వాత కూడా ముఖ్యమంత్రి మొండి వైఖరి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మూడు రాజధానులు కావాలని చెబుతున్న జగన్ ఈ మూడేళ్లలో రాయలసీమలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క పిల్ల కాలువ కూడా తవ్వలేదని ఎద్దేవా చేశారు. మోసగానిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: