పుణె నుంచి హైదరాబాద్‌కు కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్‌కు కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించారు. హైదరాబాద్‌కు 3.72 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. టీకా నిల్వ కోసం కోఠి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల కూలర్ ఏర్పాటు చేశారు. ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యత క్రమంలో కొవిడ్ టీకాను సరఫరా చేసేందుకు నోడల్ ఆఫీసర్లతో కూడిన ప్రత్యేకమైన టీకా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ కార్గో ప్రకటించింది.
ఈ నెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. తొలిరోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షలమంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. వైద్య సిబ్బంది వారంలో నాలుగు రోజులు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ ఉంటుంది.
ఇవీ చదవండి: లైవ్ వీడియో.. కొండ చరియలు విరిగి పడి రెండిళ్లు ధ్వంసం