రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం 104 కాల్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసింది. కొవిడ్‌కు సంబంధించిన సందేహాలపై రోజూ వేలాది కాల్స్ వస్తుండటంతో 300 మంది వైద్యులను కన్సల్టెంట్లుగా నియమించారు. 104 కాల్ సెంటర్ పూర్తిగా 24 గంటలపాటూ అందుబాటులో ఉంచుతామని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. రెండో విడతలో కొవిడ్ కేసుల తీవ్రత పెరిగినప్పటికీ లక్షణాల ఆధారంగా వారికి చికిత్సలు సూచించటం, తీవ్రతను బట్టీ ఆస్పత్రికి వెళ్లాలా లేక హోమ్ ఐసోలేషన్ ద్వారానే వారికి చికిత్స అందించాలా అన్న నిర్ణయాన్ని కాల్ సెంటర్లోని వైద్యులే ధ్రువీకరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గడచిన వారం రోజులుగా 104 కాల్ సెంటర్‌కు కొవిడ్ బాధితుల నుంచి కాల్స్ పెరిగినట్టు వైద్యారోగ్యశాఖ చెబుతోంది.
ప్రస్తుతం గంటకు 7900 కాల్స్ 104 కాల్ సెంటర్‌కు వస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. రోజులో వస్తున్న 60 నుంచి 70 వేల కాల్స్ నుంచి విశ్లేషణ చేసి బాధితులకు సేవలందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. కొవిడ్ సోకిన బాధితులు ఆస్పత్రులు, పడకలు, వ్యాక్సినేషన్, మందులు లాంటి వివిధ వివరాలను అడుగుతున్నట్టు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. వారి కాల్స్ ఆధారంగా తీవ్రతను బట్టీ స్థానిక ఏఎన్ఎంను బాధితుల నివాసానికి పంపి లక్షణాలను ధ్రువీకరించుకుంటున్నారు. తద్వారా తీవ్రతను అనుసరించి ఆస్పత్రులకు, కొవిడ్ కేర్ కేంద్రాలకు పంపుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించేలా కిట్లను అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ చెబుతోంది.
ప్రస్తుత 104 కాల్ సెంటర్లో 300 మంది వైద్యులను కన్సల్టెంట్లుగా నియమించారు. కరోనా బాధితులకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు ఇచ్చేందుకు వీరిని నియమించినట్టు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. వీరికి గంటకు 400 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. బాధితుడికి వైద్యుడి సలహాలు, సూచనలను, లక్షణాలను బట్టి మందులను ఇస్తారు. కరోనా పెరుగుతున్న కారణంగా చాలా చోట్ల ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులో లేని నేపథ్యంలో 104 కాల్ సెంటర్ ద్వారానైనా కరోనా కన్సల్టేషన్ సేవలందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల్లో 40 వేల వరకూ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడిస్తోంది.
ఇదీ చదవండీ... రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్ టీకాలు