Covid 19 R Value : కొవిడ్ కేసుల వ్యాప్తిలో కీలకమైన ఆర్ వాల్యూ దేశ రాజధాని దిల్లీలో ఇప్పటికే రెండు దాటేసింది. మిగతా మెట్రో నగరాల్లోనూ అది శరవేగంగా పెరుగుతోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్ వాల్యూ (రీప్రొడెక్టివ్ వాల్యూ) ఒకటిలోపే ఉండటం ఒకింత ఊరటే. అయితే వారం నుంచి కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున మున్ముందు మనవద్దా ఆర్ వాల్యూ పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే 4-5 వారాలు చాలా కీలకమని, కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేయటం తెలిసిందే.
సగానికి మించి కేసులు రాజధానిలోనే...
డిసెంబరు 26న గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం 69 కరోనా కేసులు నమోదైతే.. మాసాంతానికి ఆ సంఖ్య 198కి చేరింది. సుమారు రెండింతల కేసులు పెరిగాయి.. రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో సగానికి మించి ఇక్కడే బయట పడుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, బస్, రైల్వే స్టేషన్లతో అనుసంధానం వల్ల విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ ప్రయాణికులు భారీగా నగరానికి వస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారిలో ఎక్కువ మందిలో కరోనా నిర్ధారణ అవుతోంది. ఆర్ వాల్యూ పెరిగే కొద్దీ కేసుల సంఖ్య ఉద్ధృతమయ్యే ముప్పెక్కువ. రానున్న పండుగల నేపథ్యంలో అధిక వ్యాప్తికి అవకాశం ఉందని, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్తగా 12 ఒమిక్రాన్.. 317 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో శనివారం కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 6,82,215కు పెరిగాయి. విదేశీ ప్రయాణికుల్లో మరో 12 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు, రిస్క్ లేని దేశాల నుంచి వచ్చిన తొమ్మిది మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 79కి చేరింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28,886 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 217, రంగారెడ్డిలో 26, మేడ్చల్‌లో 18 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 4,029కి చేరింది.
ప్రమాద ఘంటికలే..
ఆర్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ కేసులు భారీగా పెరుగుతాయి. అందుకే కాంటాక్టులను గుర్తించి వారికి వెంటనే పరీక్షలు చేయాలి. పాజిటివ్‌గా తేలితే ఐసొలేషన్‌లో ఉంచాలి. అప్పుడే ఆర్ వాల్యూ నియంత్రణలోకి వస్తుంది. డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరుతున్న వారి శాతం తక్కువే. ఇది పెద్ద ఊరట. అయినా వైరస్‌ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండలేం. రానున్న 4-5 వారాల పాటు జనం గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకపోవడం, ప్రయాణాలు, పర్యటనలు వాయిదా వేసుకోవడం మంచిది. -డా.ముఖర్జీ, సీనియర్ వైద్యులు
ఇదీ చూడండి:
Telangana omicron cases : తెలంగాణలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మొత్తం కేసులు ఎన్నంటే?