కరోనా రెండో దశ ప్రభావం విమాన ప్రయాణంపై పడింది. దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలకుతోడు కరోనా రెండో దశ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా ప్రబలిన తర్వాత తక్కువ వ్యవధిలో గమ్యాన్ని చేరుకోవచ్చన్న ఉద్దేశంతో కాస్త ఆర్థికంగా ఉన్న ప్రయాణికులు విమాన ప్రయాణానికి మొగ్గు చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మేలని భావిస్తున్నారు.
గతేడాది లాక్‌డౌన్ నుంచి కోలుకుని విమానయాన రంగం పుంజుకుంటున్న తరుణంలో రెండోదశ వ్యాప్తి అధికమైంది. పౌర విమానయాన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గత నెలలో 78 శాతం నడుస్తున్నాయి. నిత్యం 34-35 వేల మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులు పెరుగుతున్నారనుకున్న సమయంలో మళ్లీ పిడుగు పడినట్లయ్యింది. విమానాశ్రయం నుంచి ఏప్రిల్‌లో సాధారణం కంటే 10-12 శాతం మంది ప్రయాణికులు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కంటే రద్దీ తగ్గిందని చెబుతున్నారు.
ఆర్టీపీసీఆర్ నిబంధనతో ఇబ్బందులు
తమ రాష్ట్రాల్లోకి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉండాలని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. లేకపోతే రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమబంగా, జమ్మూకశ్మీర్‌కు వెళ్లేందుకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి. ప్రయాణికులు ఆయా రాష్ట్రాలకు ప్రయాణించే ముందు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తీసుకోవాల్సి వస్తోంది. ఏదైనా అత్యవసర పనులపై వెళ్లేందుకు ఆర్టీపీసీఆర్ నివేదిక లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. హైదరాబాద్ నగరంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుంటే నివేదిక రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతోంది. కొందరికి వారం రోజులకు వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉన్నా.. సరైన సమయంలో నివేదిక అందుబాటులో లేకపోవడంతో ప్రయాణించేందుకు వీలు లేకుండా పోతోంది.
ఎందుకీ పరిస్థితి..?
ఈ నెల మొదటి వారంలో ప్రయాణికుల సంఖ్య సాధారణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండో వారం నుంచి కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. ప్రయాణికులు అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం దిల్లీలో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది. ముంబయిలోనూ లాక్‌డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో ఆయా నగరాలకు వెళ్లే ప్రయాణికులు తగ్గిపోయారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం 143 విమానాలు వెళ్లాల్సి ఉండగా ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన 28 విమానాలు రద్దు అయ్యాయి. వీటిల్లో ముంబయి, దిల్లీ నగరాలకు చెందిన విమానాలు ఎక్కువగా ఉన్నాయి.