రెండు రోజుల క్రితం హైదరాబాద్ చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలో బాలుడి కిడ్నాప్ ఘటన జరిగింది. పాతబస్తీకి చెందిన ఒంటరి మహిళకు రెండేళ్ల కుమారుడున్నాడు. ఉదయమంతా బిక్షాటన చేసుకుని రాత్రుళ్లు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంది. ఈ క్రమంలో ఆమె చాదర్‌ఘాట్ సమీపంలో రాత్రి కుమారుడితో నిద్రపోతుండగా గురువారం తెల్లవారుజామున రెండేళ్ల బాబును ఎవరో ఎత్తుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు కిడ్నాపర్ ఇబ్రహీంను అరెస్ట్ చేశారు. జైలుకు తరలించేముందు నిందితుణ్ని, తల్లికి అప్పగించేముందు బాబును పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షల్లో పిల్లాడికి కరోనా లక్షణాలున్నాయని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షల్లో శుక్రవారం సాయంత్రం కరోనా ఉన్నట్లు తేలింది. పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు బాలుడి తల్లి, నిందితుడు ఇబ్రహీం, నలుగురు పోలీసులు, ఇద్దరు విలేకరులను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. మరో నలుగురు పోలీసులు, ముగ్గురు టాస్క్‌ఫోర్స్ అధికారులను స్వీయ గృహనిర్బంధంలో ఉంచారు. బాలుడికి కరోనా ఎలా సోకిందో పరిశోధిస్తున్నామని తూర్పుమండలం సంయుక్త కమిషనర్ ఎం.రమేష్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం