రాష్ట్రంలో కరోనావిజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 0.85% మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 5.34 కోట్లని అంచనా. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 10,392 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,55,531కి, మొత్తం మృతుల సంఖ్య 4,125కి చేరాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కరోనాతో 72 మంది చనిపోయారు.
ఆగస్టులో ముమ్మరం
రాష్ట్రంలో బుధవారం ఉదయం వరకు మొత్తం 4,55,531 కేసులు నమోదవ్వగా.. వాటిలో ఆగస్టులోనే 2,92,035 కేసులు వచ్చాయి. ఆగస్టులో సగటున రోజుకు 9,420 కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో మొత్తం 4,125 మరణాలు సంభవించగా, వారిలో 2,646 మంది ఆగస్టులోనే చనిపోయారు. ఈ నెలలో గంటకు 3.56 మరణాల చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చదవండి: ఆంగ్ల మాధ్యమంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ