కరోనా ఉరుములతో రైతులపై పిడుగులు పడుతున్నాయి. తొలి దెబ్బ మిరప రైతుపై పడింది. గుంటూరు యార్డును బుధవారం నుంచి 5 రోజుల పాటు మూసేశారు. పలు రాష్ట్రాల్లో అనధికార లాక్‌డౌన్లు, ఎక్కడికక్కడ ఆంక్షల వల్ల పంట ఉత్పత్తుల అమ్మకాలు మందగించాయి. ఉత్తరాదిన మార్కెట్లు మూతపడటంతో రెండు రోజులుగా మామిడి ఎగుమతులు నిలిచాయి. టన్నుకు రూ.20వేల వరకు ధరలు పతనమయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో మార్కెట్లు మూసేయడం, కర్ఫ్యూ అమలు సంకేతాలతో ఇతర వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలోనూ స్థానికంగా ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతుండటం కూడా రైతులను కలవరానికి గురి చేస్తోంది. కరోనాతో గతేడాది కూడా పంటలు అమ్ముకోలేక తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతాంగానికి.. ఈ ఏడాదీ లక్షల్లో పెట్టుబడులు పెట్టాక పంట చేతికొచ్చే సమయంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
మిరప.. అమ్ముకోలేక అగచాట్లు
తెగులు ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మిరప దిగుబడులు తగ్గాయి. ఈ బెడద లేని చోట దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధర బాగుండటంతో మిరపను ఎండబెట్టి మార్కెట్‌కు తెస్తున్నారు. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల బస్తాల వరకు గుంటూరు మార్కెట్‌కు వస్తోంది. ఇదే అదనుగా ధర పతనం మొదలైంది. గత వారంతో పోలిస్తే క్వింటా రూ.వెయ్యికిపైనే తగ్గింది. ఆలస్యం చేస్తే మరెంత తగ్గుతుందోననే ఆందోళనలో ఉన్న రైతులు.. అమ్మకాలు త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆలోచిస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలో మార్కెట్‌ను 5రోజులు మూసేస్తుండటం కలవరపాటుకు గురి చేసింది. అమ్మకాలు ఆలస్యమైతే కూలీలకు ఏమని సమాధానం చెప్పాలి? తెచ్చిన అప్పులెలా తీర్చాలి? వాటిపై పెరిగే వడ్డీల భారం ఎలా మోయాలనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. శీతలగోదాములు కూడా నిండుతుండటంతో నిల్వకూ అవకాశాలు తగ్గాయి. బయట ఉంచితే నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్‌కు మధ్యస్థ రకాల రాక పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని భారత మిర్చి ఎగుమతి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వి.సాంబశివరావు తెలిపారు. చైనా, బంగ్లాదేశ్‌కు ఎగుమతులు సాధారణంగానే ఉన్నాయన్నారు.
బత్తాయి.. ధర పడిపోయింది
బత్తాయి కోతలకూ ఇది కీలక సమయం. అనంతపురం మార్కెట్‌కు నిన్న మొన్నటివరకు రోజుకు 500 టన్నుల నుంచి 700 టన్నుల సరుకు అమ్మకానికి వచ్చింది. ధరలు కూడా టన్నుకు గరిష్ఠంగా రూ.54వేల వరకు పలికాయి. 2రోజుల పాటు ఈ ధరలున్నాయో లేదో.. కరోనా పిడుగు పడింది. దిల్లీ, ఇతర మార్కెట్లు మూసేస్తుండటంతో టన్నుకు రూ.4వేల వరకు పడిపోయాయి. మంగళవారం గరిష్ఠంగా టన్నుకు రూ.50వేలు దక్కింది. సరుకు రాక కూడా 320 టన్నులకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. తోటలోనే పండ్లు పండి రాలిపోతాయనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. కూరగాయ పంటలతోపాటు పండ్ల అమ్మకాలపైనా కరోనా ప్రభావం కనిపిస్తోంది. వీటిపై రైతులు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. చిత్తూరు జిల్లాలో టమాటా సీజన్ త్వరలో మొదలుకానుంది. ఈ దశలో మార్కెటింగ్ సమస్యలు ఎదురైతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.
చేపకు చిక్కులే
కరోనాకు ముందు చేపల ధర కిలో రూ.120 వరకు పలకగా, 2020 మార్చి తర్వాత రూ.90కి పడిపోయాయి. అప్పటినుంచి అవే ధరలు కొనసాగుతున్నాయి. దిల్లీతోపాటు పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో అనధికార లాక్‌డౌన్ల ఆంక్షలతో చిల్లర వ్యాపారులు మార్కెట్‌కు రావడం లేదు. మార్కెట్‌కు వెళ్లాలన్నా వినియోగదారులు భయపడుతున్నారు. చేప, రొయ్యలు సొంతంగా కొనుగోలు చేసి ఎదురుగా కోయించుకుంటేనే నాణ్యతపై నమ్మకముంటుంది. ఇళ్లకు తెప్పించుకునే పరిస్థితి ఉండదు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ప్యాకింగ్ కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారని, మిగిలినవారూ అదే ఆలోచనలో ఉన్నారని చేపల పెంపకందారుల సంఘం ఉపాధ్యక్షుడు చదలవాడ శేషగిరిరావు వివరించారు. మొత్తంగా చూస్తే చేపలకు గిరాకీ తగ్గిందని అన్నారు.
మామిడి ధరలు సగానికి పతనం
ప్రస్తుతం మామిడి కోతలు పెరిగి మార్కెట్‌కు ఎక్కువగా వస్తోంది. ఆరంభంలో టన్ను రూ.90వేల వరకు పలకగా, తర్వాత క్రమంగా రూ.50వేలకు తగ్గింది. కరోనా రెండో దశ ప్రభావంతో.. మామిడి అమ్మకాలకు ప్రధాన మార్కెట్లయిన దిల్లీ, ముంబయి, జయపుర్, కాన్పూర్, ఇండోర్, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. దిగుమతులూ లేవు. కొనుగోలుకు వ్యాపారులు రావడం లేదు. దీంతో 2,3 రోజుల వ్యవధిలోనే కృష్ణా జిల్లాలో టన్ను మామిడి ధర రూ.50వేల నుంచి రూ.25వేలకు పడిపోయింది. ‘మామిడి దిగుమతి చేయడం ఒక రోజు ఆలస్యమైనా కాయలు ఉడుకెత్తుతాయి. పక్వానికి రావు. పూర్తిగా నష్టపోవాల్సిందే. ముంబయికి వంద లారీల మామిడి వెళ్తే 70 లారీలే దించారు. మిగిలిన 30 లారీలు ఆగిపోయాయి. గతంలో ఒక లారీ వెళ్తే.. పది మంది వ్యాపారులు వచ్చి పోటీపడి కొనేవారు. ఇప్పుడు వారి సంఖ్య తగ్గింది’ అని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం రైతు శ్రీనివాసరావు వివరించారు. కరోనాతో గతేడాది ఇదే సమయంలో ఎగుమతులు నిలిచాయి. కొన్నాళ్లపాటు పంట అమ్ముకోలేక.. ధర దక్కక తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమవుతోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: