కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న అమెరికాలోని ప్రవాసాంధ్రులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ప్రకటన న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. ప్రవాసాంధ్రుల్లో మనోధైర్యం నింపుతూ సీఎం వీడియో సందేశాన్ని అక్కడ ప్రదర్శించారు. అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఈ సందేశాన్ని ఏర్పాటు చేశారు. 'అమెరికాలోని ప్రవాసాంధ్రులంతా సురక్షితంగా ఉండండి.. ఏపీలోని మీ ఆప్తుల రక్షణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది' అంటూ జగన్ సందేశం ఉంచారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టైమ్ స్క్వేర్‌లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చే సందేశం ఏర్పాటు చేయడం చరిత్రలో ఇదే తొలిసారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రంలోని తమ వారి గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు సీఎం సందేశం అక్కడ ప్రదర్శించినట్టు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు