శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో ఇటీవల జరిగిన ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు పీఎంకు ఆయన సోమవారం లేఖ రాశారు. సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ(సీఈఏ)తో శాఖాపరమైన విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనలో క్రిమినల్ కోణం ఉందని ఆరోపించారు. వందల కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.
శ్రీశైలం ఘటనతో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రభాకర్ రావు ఎండీగా ఉండడం వల్ల జెన్కో, ట్రాన్స్కో నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బయట ఎవరి దగ్గరి నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు.