APSRTC FAIR దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ డాట్ కామ్ వెబ్ సైట్‌లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. వెళ్లాల్సిన ప్రాంతాల వివరాలను నమోదు చేయగానే..ఆ రూట్లో నడిపే బస్సులు.. వసూలు చేసే ఛార్జీల వివరాలను ఆర్టీసీ తెలియజేస్తుంది. దీన్ని బట్టి ప్రయాణికులు ఆర్టీసీ వసూలు చేస్తోన్న చార్జీ, ప్రైవేటు బస్సుల్లో ధరలతో పోల్చుకుని ఓ నిర్ణయానికి వస్తారు. అయితే.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ మయాజాలం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ప్రయాణికుడు.. వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయగానే ఏ సమయానికి ఏ బస్సు ఉంది,ఎంత చార్జీ అనే వివరాలు వస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జీ 437 రూపాయలని.. వెబ్ సైట్లో చూపిస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ కంటే తక్కువగా చార్జీ ఉందని భావించి ముందుకెళ్తే అసలు విషయం బోధపడుతుంది. సర్వీసును ఎంపిక చేసుకుని, ఎక్కాల్సిన స్థానం, దిగాల్సిన స్ధానం వివరాలను ఎంపిక చేశాక బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే వివరాలతో సీట్ల లే అవుట్ వస్తుంది. ఇక్కడ సీటుపై క్లిక్ చేయగానే టికెట్ రేటు ఒక్కసారిగా పెరిగిపోతోంది.
తొలుత 437 రూపాయలు చూపించిన టికెట్ ధర.. ఇప్పుడు 513 రూపాయలు చెల్లించాలని చూపిస్తుంది. అంటే 76 రూపాయలు పెరిగింది. ప్రైవేటు బస్సులతో సమానమవుతోంది. అమరావతి ఏసీ సర్వీసులో తొలుత 671 రూపాయలుగా టికెట్ ధర చూపిస్తుంది. బస్సు సీట్ల లేఅవుట్‌లో సీటు బుకింగ్ చేసుకోగానే టికెట్ ధర 786 రూపాయలకు పెరుగుతోంది. ఏకంగా 115 రూపాయలు అధికమవుతుంది. బస్సు సర్వీసు రకాన్ని బట్టి చార్జీ ఎక్కువగా పెరుగుతూ పోతోంది. రద్దీ వేళల్లో ఒక్కోసారి ప్రైవేటు ట్రావెల్స్ వసూలు చేసే చార్జీ కన్నా ఆర్టీసీ వసూలు చేసే చార్జీ ఎక్కువగా ఉంటోంది.
ఏపీఎస్ఆర్టీసీలో తక్కువ చార్జీ ఉంటుందని ఆశించిన వారు.. ఈ తరహా మాయాజాలం చూసి విస్తుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తిరిగే అన్ని బస్సుల్లోనూ కొన్ని నెలలుగా ఇదే విధానం అమలు జరుగుతోంది. చార్జీలు పెరుగుదలను గుర్తించిన ప్రయాణికులు.. ఇదేక్కడి మాయాజాలం అంటూ.. సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. చార్జీల విషయంలో పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ.. ఇలా చేయడమేంటని నిలదీస్తున్నారు. చాలా మంది ప్రైవేటు ట్రావెల్స్ వారు వెబ్ సైట్లో బేసిక్ ఫేర్, టాక్స్ లను కలిపి ఒకే రేటు నిర్ణయించి చివరి వరకూ అదే మొత్తాన్ని సూచిస్తూ వసూలు చేస్తున్నారు.
పక్క రాష్ట్రం తెలంగాణలోని టీఎస్ఆర్టీసీ కూడా బేసిక్ ఫేర్ , పన్నులు కలిపి అన్నిచోట్ల ఒకే టికెట్ రేటును వసూలు చేస్తోంది. వెబ్ సైట్ తెరవగానే ఓ రేటు సీటు బుకింగ్ చేసుకోగానే మరో రేటు చూపించడం లేదు. వాస్తవ టికెట్ ధరను చూపిస్తుండగా.. ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కేవలం బేసిక్ ఫేర్‌ను మాత్రమే చూపిస్తూ ప్రయాణికులను తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. టికెట్ బుక్ చేసుకున్నాక తెలంగాణ బస్సుల కంటే ఎక్కువగానే టికెట్ ధరను వసూలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి విధానం అమలు చేయడం ఏంటని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ వెబ్ సైట్లో బేసిక్ ఫేర్, పన్నులు కలిపి అన్ని చోట్ల ఒకే టికెట్ ధర చూపించాలని గందరగోళానికి, మాయాజాలానికి తెరదించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: