Alcohol consumption : మద్యపానం, ధూపపానం నేడు సర్వసాధారణమైపోయాయి. తమకు వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా..వీటిపై ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదంటేనే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. రెక్కాడితే కాని డొక్కాడని పేదల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, నిపుణులు ఒక్కరేమిటి..ఇలా అందరూ వీటిని అలవాటు చేసుకుంటూన్నారు. తద్వారా వారిని వారు నష్ట పరుచుకుంటున్నారు. వారి మీద ఆధారపడిన వారికి తీరని ఆవేదనను మిగులుస్తున్నారు. చివరికి గౌరవాన్నీ పోగొట్టుకుంటున్నారు.
ఇరవై సంవత్సార క్రితం మద్యపానం, ధూమపానం తీవ్రమైన దురలవాట్లన్న భావన అందరిలో ఉండేది. కాలంతో పాటు జీవన విధానంలో మార్పు రావటం, దృశ్య మాధ్యమాల ప్రభావం, పార్టీ కల్చర్ పెరగటం వంటి వాటి వల్ల అవేమి పెద్ద విషయాలు కాదన్నట్లుగా మారింది.
వచ్చే ఆదాయంలో వ్యసనాలకు సామాన్యులు ఎంత తగలేస్తున్నారో కొన్ని ఉదాహరణలు...
* తెనాలికి చెందిన ఓ చేతివృత్తి కార్మికుడు ఏడాదికి అయ్యేది రూ. 96,000/- మద్యానికి ఖర్చు చేస్తున్నాడు.
అతని సంపాదన నెలకు రూ.18,000. మద్యానికి నెలకు ఖర్చు చేసేది: 8,000 (రోజూ 200 నుంచి 400 మధ్యలో).
నష్టాలు: 10వేల రూపాయలతో ఇంటి అద్దె, పిల్లలు, కుటుంబ అవసరాలు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. పదేళ్ల క్రితం దేహదారుఢ్యం ఉండేది. తాగడం అలవాటయ్యాక క్షీణించడం మొదలయ్యింది. కాలేయం దెబ్బతినడంతో మంచానికి పరిమితం అయ్యాడు. భార్యాపిల్లలు వీధినపడ్డారు. కుటుంబం అప్పులపాలయ్యింది.
ఇలా చేసుంటే... గట్టి దేహానికి శారీరకశ్రమ తోడై ఆరోగ్యం బాగుండేది. మద్యం ఖర్చును పొదుపునకు మళ్లిస్తే పీపీఎఫ్ వడ్డీ
7.1శాతానికి సంయుక్త వడ్డీ, మెచ్యూరిటీ (15 ఏళ్లకు): 26,03.654, మ్యూచువల్ ఫండ్‌లో 12 శాతానికి కాంపౌడింగ్
ఐదేళ్లకు 6.53 లక్షలు, పదేళ్లకు 18.4 లక్షలు లభించేవి.
* విజయవాడ చెందిన ఓ వృత్తి నిపుణుడు ఏడాదికి అయ్యేది రూ. 90,000/- ఖర్చు పెడుతున్నాడు. అతని సంపాదన నెలకు రూ.60,000/-. టీ, ధూమపానానికి నెల ఖర్చు రూ.7500/-.
నష్టం: ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. రూ.5లక్షలకు పైగా చికిత్సకు వ్యయం అయింది. అనారోగ్యంతో పని చేయలేక పోతున్నారు. కొత్తల్లో ఆయన ఒత్తిడి సమయంలో సిగరెట్లు తాగటం మొదలు పెట్టారు. అది అలవాటుగా మారి రోజుకు రెండు పెట్టెలకు చేరుకుంది.
అదే ఇలా చేసుంటే.. సొంత కారు, మంచి కళాశాలలో పిల్లల చదువులు సాగే జీవితం తల్లకిందులయ్యేది కాదు.
పీపీఎఫ్ వడ్డీ 7.1 శాతం కాంపౌండింగ్‌తో కలిపి మెచ్యూరిటీ సమయానికి: (15 ఏళ్లకు): 24,40,926. మ్యూచువల్ ఫండ్‌లో 12 శాతానికి(సిప్ ప్రకారం) ఐదేళ్లకు 6.13 లక్షలు, పదేళ్లకు 17.25 లక్షలు వచ్చేవి.
శక్తిని దాచలేం.. ఆదాయం దాచుకోవచ్చు
- బీటీవీఎస్.నారాయణ, ఆర్థిక వ్యవహారాల సలహాదారు
శక్తిని, వయసును దాచుకోలేము, కాని ఆ సమయంలోని సంపాదనను దాచుకోవచ్ఛు. పొదుపునకు ఇంత మొత్తం అని ఏమీ లేదు. నెలకు రూ.100 అయినా పోస్టల్ ఖాతా ద్వారా దాచుకోవచ్ఛు. ఈ మొత్తాన్ని మన ఆదాయాన్ని అనుసరించి ఎంతైనా పెంచుకోవచ్ఛు. కుటుంబానికి ప్రతివారూ బీమా భరోసా ఇవ్వాలి. వ్యసనానికి తగలేసేవారు ఒక్కసారి ఆలోచించాలి.
నిబంధనలు అమలు కావటం లేదు
2016వ సంవత్సరంలో నేను గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో సహాయ ఆచార్యునిగా ఉన్న సమయంలో మా బృందం ‘సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం’ అమలు తీరుపై గుంటూరు, తెనాలి, నర్సరావుపేట, సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లో సర్వే చేశాం. ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం అరికట్టాల్సి ఉండగా ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ధూమపానం చేసే వారితో పాటు వారితో ఎటువంటి సంబంధం లేని వారు కూడా ఆ పొగను పీల్చి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విషయాలను అప్పట్లోనే నగరపాలక, పురపాలక సంఘాల అధికారులు, బస్టాండ్, రైల్వేస్టేషన్ల పర్యవేక్షకులకు చెప్పాం. క్షేత్ర స్థాయి అధ్యయనం వివరాలను నమోదు చేశాం. అయితే నేటికీ పరిస్థితుల్లో మార్పు లేదు.
చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు
- డాక్టర్ కొడాలి వెంకట ఉమాకాంత్, డీ.ఏ., యం.డి., విజయవాడ.
మద్యపానం, ధూమపానం వల్ల కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం మొదలవుతుంది. గుండెపోట్లు వస్తాయి. గతంలో ఇటువంటి అనారోగ్యం ఎక్కువగా 40 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చేవి. ఇప్పుడు 20 నుంచే మొదలవుతున్నాయి. ఇటీవల 19 నుంచి 25 సంవత్సరాల నడుమ వయస్సు ఉన్న 5 వేల మంది యువతపై ఆరోగ్య సర్వే జరిగితే వారిలో 40 శాతం మందికి మధుమేహం ఉంది. మన ఆరోగ్యం, మన జీవితం మన చేతుల్లో ఉందని మరవద్ధు.
ఇదీ చదవండి : Shortage of Musical Instrument Veena Makers : తయారీదారులు లేక మూగబోతున్న వీణ...