రస్-అల్-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ లేవనెత్తిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి సీనియర్ అధికారుల కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎండీసీ, ఏఎన్ఆర్ఏకే అల్యూమినియం లిమిటెడ్ మధ్య బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు అంశంపై నెలకొన్న సమస్య పరిష్కారంపై కమిటీ పని చేస్తుందని ఆదేశాల్లో తెలిపింది.
ఆరుగురు సీనియర్ అధికారుల కమిటీ ఛైర్మన్గా గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణద్వివేదీ వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో సహా గనులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పి.వి.చలపతి రావు, కె.వి.వి సత్యనారాయణ, ఏపీఎండీసీ ఎండీ హరినారాయణ, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ వీణకుమారి దెర్మల్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి సభ్యులుగా ఉన్నారు. నెల రోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండీ... ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య