సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అభియోగాలపై విచారణలో భాగంగా ముఖ్యమంత్రి సీపీఆర్వో పూడి శ్రీహరికి సమన్లు జారీ చేసి పిలిపించాల్సిన అవసరం లేదని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్.పి.సిసోడియా పేర్కొన్నారు. కేసు దర్యాప్తుతోనూ లేదా ఆ కేసుకు సంబంధించిన పత్రాల సంరక్షణ విషయంలోనూ ఆయనకు సంబంధం లేనందున విచారణకు పిలిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని వివరించారు. ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన శుక్రవారం లిఖితపూర్వకంగా సమాచారమిచ్చారు.
తనపై నమోదైన అభియోగాల విషయంలో ఏసీబీలోని సీఐయూ విభాగానికి చెందిన అప్పటి డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సాయికృష్ణ, సీఐడీ అప్పటి డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్, ముఖ్యమంత్రి సీపీఆర్వో పూడి శ్రీహరిని విచారణకు పిలిపించాలని ఏబీ విచారణాధికారిని గతంలో కోరారు. ‘‘సాయికృష్ణను విచారణకు పిలిపించి ఆయన చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నాం. ఆర్.విజయ్‌పాల్ ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నానని, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని సమాచారమిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందున ఆయనను పక్కన పెట్టాం. పూడి శ్రీహరి విచారణ అవసరం లేదని నిర్ణయానికొచ్చాం’’ అని పేర్కొంటూ ఆర్.పి.సిసోడియా ఏబీ వెంకటేశ్వరరావుకు సమాచారం పంపించారు.
ఇదీ చదవండి: