KCR review on drug use control: వినూత్నరీతిలో ఆలోచించి బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు. ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సు కొనసాగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి వరకు పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రం కూడా సమూలంగా నిర్మూలించేందుకు పోలీస్ అధికారులు వినూత్నరీతిలో ఆలోచించాలని సీఎం సూచించారు. బాధ్యత కలిగిన మానవులుగా, బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అద్భుత శాంతిభద్రతల వల్లే అనతికాలంలోనే అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతోందని ముఖ్యమంత్రి అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని అన్నారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అన్నారు.
వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు
వెయ్యి మంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పలు అసాంఘిక శక్తులు, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్న కేసీఆర్... అదే తరహాలో నార్కోటిక్ డ్రగ్స్‌ను నియంత్రించే విభాగం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా పని చేయాలని చెప్పారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీసు అధికారులకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రత్యేక పదోన్నతులు, తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Committee on PRC: 'చర్చలతోనే సమస్య పరిష్కారం.. ఉద్యోగులు గుర్తించాలి'