కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 104 కాల్ సెంటర్ సమర్థంగా పనిచేయాలని.. ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. 104కి ఫోన్ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని పునరుద్ఘాటించారు. 104 కాల్ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
అలాంటి వారిని ఉపేక్షించవద్దు..
వదంతులు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం, వాస్తవాలు మరుగున పెట్టి, అసత్యాలు ప్రచారం చేస్తే, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాంటి వారిని అరెస్టు చేయాలని , జైలుకు పంపాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే అందరు ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలన్నారు. కొవిడ్ పరిస్థితిపై ప్రతిరోజూ అధికారికంగా బులెటిన్ ఇస్తారని దాన్నే అందరూ తీసుకోవాలన్నారు. కొవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారని , ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి, అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రమవుతుందన్నారు. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఆదేశించారు.
ఆస్పత్రులను పర్యవేక్షించండి..
లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే, సామాన్యుడికి 4 రూపాయలు నష్టం కలుగుతుందని, గత ఏడాది లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వానికి దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగింది. అంటే ప్రజలకు దాదాపు 80 వేల కోట్ల నష్టం జరిగిందని సీఎం తెలిపారు. 104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నెంబర్‌కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలని సీఎం ఆదేశించారు. జేసీలు ఇకపై కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌కు చికిత్స అందిస్తోన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను పర్యవేక్షించాలన్నారు.
భౌతికదూరం తప్పనిసరి...
దేశంలో నెలకు 7 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండగా, అందులో కొవాక్సిన్ కోటి డోస్‌లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్ ఉత్పత్తి జరుగుతోందని సీఎం వివరించారు. రాష్ట్రంలో 45ఏళ్ళకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షలమందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 18–45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్ ఇస్తామన్నారు. అలాగే కొవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
15 రోజుల్లో పరిష్కరించండి..
ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ,ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో 17,053 జగనన్న కాలనీల్లో 16,450 కాలనీలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మొత్తం పూరైందన్నారు. నెల్లూరు, గుంటూరు, విజయనగరం, వైయస్సార్ కడపతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 15 రోజుల్లో వాటన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించిన 51,859 దరఖాస్తులను వచ్చే 15 రోజుల్లో పరిష్కరించాలన్నారు.
నేడు వసతి దీవెన...
ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన సీఎం...తొలి దశలో చేపట్టిన 14.89 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 90,105 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కావాలని, కలెక్టర్లు వెంటనే అంచనాలు రూపొందించి, డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. స్పందనలో వచ్చిన పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బుధవారం జగనన్న వసతి దీవెన నిధులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. మే 13న రైతు భరోసా, మే 18న మత్స్య కార భరోసా, మే 25న గత ఏడాది (2020) ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్సు డబ్బు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'మల్లెపువ్వు వాసన, మామిడి పండు రుచి తెలిస్తే.. కరోనా లేనట్టే'