ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం-2016ను సవరించడం పైనా సమీక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీ చట్ట సవరణకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కళాశాలలను విశ్వవిద్యాలయాలుగా మార్చుకోవాలనుకుంటే అందుకు అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో ప్రైవేటు వర్సిటీలకు సంయుక్త సర్టిఫికేషన్ ఉండాలి. ఇది ఐదేళ్లపాటు కొనసాగాలి. ఇవి ఉంటేనే ప్రైవేటు వర్సిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హత ఉన్నట్లు పరిగణించాలి’’ అని సీఎం సూచించారు.
ఉన్నత విద్యలోనూ ఆంగ్ల మాధ్యమమే..
‘‘అన్ని డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలి. వెంటనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా డిగ్రీ మొదటి ఏడాదిలో తగిన కోర్సులు ప్రవేశపెట్టాలి. పాఠ్యపుస్తకాలన్నీ ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. బీఏ, బీకాంలాంటి కోర్సులు చేసి, ఆంగ్లంలో మాట్లాడలేకపోతే పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం. ఉద్యోగావకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికలను రూపొందించాలి. బీకాం చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలు, స్టాక్‌మార్కెట్ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. దీంతో స్వయం ఉపాధికి అవకాశం ఏర్పడుతుంది. ఆన్‌లైన్‌లో మంచి కోర్సులు ఉన్నాయి. అందులోని అంశాలను పాఠ్యప్రణాళికలోకి తీసుకురావాలి’’ అని ఆదేశించారు.
ఇంటర్‌నెట్ లేని వైఫై..
ఆన్‌లైన్ అభ్యాసన కోసం ఇంటర్‌నెట్ లేని వైఫైౖ ప్రోటోకాల్ రిమోట్ డివైజ్ ద్వారా ఒకేసారి 500మంది వినియోగదారులకు అనుసంధానమయ్యే (కనెక్ట్) ప్రాజెక్టుకు సీఎం ఆమోదం తెలిపారు. ఒక్కో రిమోట్ డివైజ్ పరిధి 100 మీటర్లు ఉంటుంది. ల్యాప్‌టాప్, ట్యాబ్, టీవీలతో కనెక్ట్ అయ్యే అవకాశంతోపాటు క్షణాల్లో డేటా బదిలీ అవుతుంది. ఇంటర్‌నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత సైతం ఈ సదుపాయాన్ని వాడుకునేలా డివైజ్‌లను రూపొందిస్తారు.
ప్రభుత్వంలో లేదా ప్రైవేటులో ‘ఎయిడెడ్’..
ఎయిడెడ్ కళాశాలలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఇవి పూర్తిగా ప్రభుత్వంలోనైనా లేదంటే ప్రైవేటులోనైనా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహించాలని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు: కొడాలి నాని