ఇసుక తవ్వకాల్లో అవినీతిని దూరం చేశామని... ఈ విషయం గర్వంగా చెప్పగలమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఎప్పుడూలేని విధంగా వర్షాలు కురిసి, వరదలు వస్తున్నాయన్నారు. వరదల వల్ల ఆశించినంత రీతిలో ఇసుకను తీయలేకపోతున్నామన్న సీఎం... మరో వారంలో వరదలు తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇసుక వారోత్సవం అనే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. వారం రోజులపాటు ఇసుకమీదే పనిచేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వారం తర్వాత ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామన్న జగన్... ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క ఇసుక లారీ వెళ్లకూడదని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలని ఆదేశించారు. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో సుమారు 70 రీచ్‌లు గుర్తించాలన్న సీఎం జగన్... 267 రీచ్‌లు ఉంటే వరదల వల్ల 69 చోట్లకు మించి ఇసుక తీయలేకపోతున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ... 'సీఎం జగన్ అమరావతిని అడవిగా మార్చారు'