తెలంగాణ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. శ్రీశైలం నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతున్నందున.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ‘వరదల కారణంగా విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. సహాయ శిబిరాల్లో ఉన్న వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి కనీసం రూ.500 చొప్పున ఇవ్వండి. వారి ఇళ్లలో పరిస్థితిని ఆరా తీసి ఆదుకోండి. భారీ వర్షాలతో వేర్వేరు జిల్లాల్లో చనిపోయిన పది మంది బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించండి...’ అని ఆదేశించారు. ‘వారం రోజుల్లో పంట నష్టం అంచనాలు తయారు చేసి పంపాలి.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలి. చెరువులు, కాల్వల గండ్లు పూడ్చాలి. దెబ్బతిన్న రహదారులకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలి. నాలుగైదు నెలల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి...’ అని అధికారులకు స్పష్టం చేశారు.
చెరువులు నింపడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి
రాయలసీమతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చెరువులు నింపడంపై కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. దీనికనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘చిత్తూరు జిల్లాలో 40% అధికంగా వానలు కురిసినా.. కేవలం 30% మాత్రమే చెరువులు నిండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ పద్ధతి మారాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి. కరవు నివారణలో శాశ్వత పరిష్కారం చూపాలి...’ అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కండలేరులో గరిష్ఠంగా 60 టీఎంసీల నీటిని నిల్వ చేయబోతున్నామని చెప్పారు. భారీ వర్షాలు, వరదలు ఉన్నా ధాన్యం సేకరణ యథావిధిగా కొనసాగుతుందని, ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్ద నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాలు పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తారన్నారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఇదీ చదవండి: