CM Jagan review: వరద బాధిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆయన సచివాలయంలో సమీక్షించారు. సీనియర్ అధికారులు, కలెక్టర్లు సహాయ కార్యక్రమాల బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. వరద బాధితులకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం, కూరగాయలు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు సహాయంగా ఇవ్వాలన్నారు. మంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కొందరు రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని.. జగన్ విమర్శించారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని.. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని ఆయన గుర్తుచేశారు. వరదల కారణంగా ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉందని.. ఆ బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
వరదలు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలని ఆదేశించారు. గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించి.. వారిని ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. జిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి.. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మురుగు నీటి కాల్వల్లో పూడిక తీయడం సహా.. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలపై పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలని సూచించారు. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలన్నారు. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలని.. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 48 గంటల్లో ఈసమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనేక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారని.. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు వాటిని పరిశుభ్రంగా అందించాలని సూచించారు.
ఇవీ చూడండి: