లెర్న్ టు ఎర్న్ కార్యక్రమానికి హైస్కూల్ స్థాయిలోనే నాంది పడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సమీక్షించిన ఆయన.. కిండర్ గార్డెన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాఠశాల విద్య పరిధిలోకి పీపీ-1, పీపీ-2 ప్రతిపాదనపై పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల పక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం సమీక్షలో వివరాలను మంత్రి సురేశ్ వెల్లడించారు.
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు..?
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెలవుల కుదింపు, సిలబస్ అంశాలపై త్వరలో ఎస్ఓపీ విడుదల చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్క్ పుస్తకాలు ఉంటాయని... వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్‌లు ఏర్పాటవుతాయని తెలిపారు. ప్రస్తుతం రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలు ముద్రించామని వెల్లడించారు. 8వ తరగతి నుంచి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. దశలవారీగా కేరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. 8వ తరగతి నుంచి మౌలిక అంశాలతో విద్యాబోధన ఉంటుందన్నారు. దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
సంస్థాగత మార్పులపై దృష్టి
నాడు-నేడు కార్యక్రమం 3 దశల్లో పూర్తి చేస్తామన్న మంత్రి సురేశ్... విద్యాశాఖలో నాణ్యతా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టామని తెలిపారు. ఏడాదిగా మౌలిక సౌకర్యాల పెంపుపై నిధులు ఖర్చు చేశామని... ఇకపై సంస్థాగత మార్పులపై దృష్టి పెడతామన్నారు. డైరెక్టర్ల స్థాయిలో నియామకంపై ముఖ్యమంత్రికి ప్రతిపాదించామని.. పాఠ్య పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమం, ఇతర విభాగాలకు ప్రత్యేక అధికారులు కావాలన్నారు. మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో శుభ్రతపై పర్యవేక్షణకు డైరెక్టర్ స్థాయి అధికారి ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో 25 జిల్లాలు ఏర్పాటైతే అధికారులు అవసరమని చెప్పారు.
వచ్చే ఏడాది నుచి ప్రీప్రైమరీ, కిండర్ గార్డెన్
సీఎం జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ విద్య కూడా ప్రవేశపెడతామని మంత్రి సురేశ్ ప్రకటించారు. అకడమిక్ ఆడిటింగ్ జరగాల్సి ఉందన్న మంత్రి... పాఠశాల కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కిండర్ గార్డెన్ విద్య వచ్చే ఏడాది నుంచి మొదలుపెడతామన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత, మరుగుదొడ్ల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు.
త్వరలో కళాశాలల్లో ఖాళీల భర్తీ
156 మండలాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని... కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సురేశ్ హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో డైట్ కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. యూనిఫైడ్ సర్వీసుల అంశంపై కమిటీ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు అక్రిడేషన్లు
ప్రైవేటు పాఠశాలల నాణ్యత తనిఖీ చేసి అక్రిడేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు విద్యా శాఖ మంత్రి తెలిపారు. ఏటా పాఠశాలల పనితీరు మదింపు ఉంటుందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానంపై టోఫెల్ తరహా పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చూడండి..
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్, చికిత్సకు ప్రాధాన్యం: జవహర్ రెడ్డి