CM JAGAN: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాన్ని సీఎం వైఎస్ జగన్ అందించారు. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, సహా 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లు నిధులను విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం నిధులను విడుదల చేశారు. రుణాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
చిరువ్యాపారులు సమాజానికి గొప్ప సేవను అందిస్తున్నారన్న సీఎం...తమకు తాము ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలకు సేవలందించే గొప్ప వారని ప్రశంసించారు. చిరువ్యాపారులు స్వయం ఉపాధి పొందుతూనే ఆటోలు, కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. లక్షల మంది చిరువ్యాపారులు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతున్నారని, ప్రభుత్వం చేస్తోన్న సహాయంతో వాళ్ల కాళ్లపై వారు నిలబడేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. చిరు వ్యాపారులు ఆర్గనైజ్డ్ సెక్టార్ లో లేకపోవడం వల్ల అప్పులు ఇవ్వని పరిస్ధితి గతంలో ఉండేదని, వారికి మంచి జరగాలి, అండగా ఉండాలనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చినట్లు సీఎం తెలిపారు. చిరు వ్యాపారులు తీసుకునే రుణాలకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రుణాలు ఇప్పిస్తోందని, ఇప్పటివరకు 14 లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి చేశామని సీఎం తెలిపారు.
వడ్డి భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది: సీఎం
గతంలో చిరువ్యాపారులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకునే అద్వాన్న పరిస్ధితి ఉండేదన్న సీఎం...ప్రస్తుతం ఆ పరిస్ధితులు లేవన్నారు. సకాలంలో రుణాలను చెల్లించి వారి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. 6 నెలలకు ఓ సారి చొప్పున వడ్డీ తిరిగిస్తున్నామని, 16.16 కోట్ల రూపాయలను వడ్డీ రీయింబర్స్మెంట్ కింద ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 14.16 లక్షలకు పైగా చిరువ్యాపారులకు 1416 కోట్లు వడ్డీ లేకుండా రుణాలిచ్చినట్లు సీఎం తెలిపారు. వడ్డీ రీయింబర్స్మెంట్ కింద ఇప్పటి వరకు రూ.32.50 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.
వ్యవస్థను నీరుగార్చవద్దు: సీఎం జగన్
గొప్ప వ్యవస్థను తీసుకువచ్చామని, వ్యవస్థను నీరుగార్చవద్దని కోరారు. చిరువ్యాపారులు సకాలంలో రుణాలు చెల్లించాలని కోరారు. అలా చేస్తే ప్రభుత్వమే వడ్డీ లను చెల్లించడం సహా రుణం తీరగానే చిరువ్యాపారులకు బ్యాంకులు తిరిగి తప్పకుండా రుణాలు ఇస్తాయన్నారు. జీవితాలు మారాలి.. మార్పు రావాలి, మెరుగైన పరిస్ధితులు రావాలనే తపనతో ఇవన్నీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎవరికైనా పొరపాటున రుణం రాకపోతే కంగారు పడవద్దని, సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హతను బట్టి లబ్ది చేకూర్చుతామన్నారు. ఈ పథకం కింద ఎవరికైనా లబ్ధి చేకూరకపోయినా ఆందోళన చెందొద్దని, గ్రామ, వార్డు వాలంటీరును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పథకం అమలును నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా www.gramasachivalayam.ap.gov.in పోర్టల్‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా సందేహాలు ఉంటే 08912890525కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు.
కొవిడ్ సమయంలో దేశంలో 82 శాతం చిరు వ్యాపారులు ఆదాయం కోల్పోయి, అవస్థలు పడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయని, రాష్ట్రంలో ఆ పరిస్ధితి రాకుండా పేదలు, చిరువ్యాపారులకు ఆర్ధిక సాయం అందించామని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.29 లక్షల కోట్ల రూపాయలను పేదల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.
కేంద్రం ఆదర్శంగా తీసుకుంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ‘జగనన్న తోడు’ను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అమలు చేస్తోంది. అన్నిచోట్లా రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: