‘చేనేత కార్మికులు పడుతున్న అవస్థలను నా పాదయాత్రలో చూశా. వారి కష్టాలను ఎప్పటికీ మరచిపోను. అందుకే కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే వరుసగా మూడోసారి ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సొంత మగ్గం కలిగిన, ఆ మగ్గం మీద ఆధారపడిన చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేల చొప్పున సాయాన్ని ఇస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా రూ.191.08 కోట్లను సీఎం జగన్ మంగళవారం బటన్ నొక్కి 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఈ పథకం కింద ఏటా రూ.200 కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.1000 కోట్లు వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. అవినీతి, వివక్షకు తావులేకుండా పథక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజులపాటు గడువు ఇస్తాం. తనిఖీ పూర్తి చేసి అర్హత ఉంటే సాయం అందిస్తాం. అనర్హులకు రాకూడదు. అర్హత ఉన్న వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ చేయూత అందించాలనేది ప్రభుత్వ ఆలోచన’ అని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం
‘ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.600 కోట్లు లబ్ధిదారులకు అందించాం. గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలు, ఆప్కోకు బకాయిపడ్డ రూ.103 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, కార్మికులకు ఖర్చు చేసింది రూ.25 కోట్లే’ అని సీఎం జగన్ వెల్లడించారు. ‘కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కుల కోసం, చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫారమ్స్ కోసం ఇలా రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చేనేత కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆప్కో ద్వారా ఈ మార్కెటింగ్ ఫ్లాట్‌పాం తీసుకొచ్చాం. దీని ద్వారా ఉత్పత్తులు అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ప్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఆప్కో కనిపించే విధంగా చర్యలు తీసుకున్నాం’ అని సీఎం జగన్ వివరించారు.
మగ్గాల ఆధునికీకరణ: మంత్రి గౌతమ్‌రెడ్డి
నేతన్న నేస్తం పథకం లబ్ధితో మగ్గాల ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘గతంలో కార్మికులు మగ్గం కింద కూర్చుని చేసేవాళ్లు. ఇప్పుడు నిల్చుని పనిచేసేలా ఆధునికీకరణ చేపడతాం. ఈ మార్పువల్ల గతంలో రూ.5-6వేలే ఆదాయం వచ్చే వారికి రూ.25వేల వరకు సంపాదించే అవకాశం కలుగుతుంది’ అని వెల్లడించారు. నేతన్న నేస్తం సాయంతో మగ్గాలను ఆధునికీకరించి అధిక ఆదాయం పొందుతున్నామని, కరోనా కష్టకాలంలో సాయాన్ని అందించి తమను ఆదుకున్నారని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలి
బ్రిటన్ బృందాన్ని కోరిన సీఎం
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ బృందాన్ని సీఎం జగన్ కోరారు. ఏపీ, తెలంగాణ బ్రిటన్ డిప్యూటీ హైకమిషనరు ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ వరుణ్ మాలి, తదితరుల బృందం మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సీఎం జగన్ వారికి వివరించారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్తు వాహనాలు, వ్యవసాయ సాంకేతికత, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ బృందం సీఎంకు తెలిపింది.
ఇదీ చదవండి: