ఒడిశాతో ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చల ప్రతిపాదన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న నేరడి బారేజీకి సంబంధించిన సమస్యలపై.. ముఖ్యమంత్రుల స్థాయిలో పరస్పరం చర్చించుకుందామని.. అందుకు అపాయింట్మెంట్ ఇవ్వమంటూ శనివారం జగన్ లేఖ రాశారు.
లేఖలో ఏముందంటే..
ఆంధ్రా-ఒడిశాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలు పరస్పర గౌరవం, నమ్మకంతో వ్యవహారించాయని.. ఇక ముందు అదే కొనసాగాలని అభిలాషించిన జగన్ .. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న నేరడి బేరేజీ అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 13,2017న వంశధార ట్రైబ్యునల్ వెలువరించిన తుది తీర్పు ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య.. వంశధార నదిపై.. శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. బ్యారేజీకి ఎడమ వైపున ఒడిశాలో కూడా స్లూయిజ్ ఏర్పాటుకు ట్రైబ్యునల్ అనుమతించిందని గుర్తు చేశారు.
ఈ విషయంపై వివరణ కోరుతూ ఒడిశా వంశధార ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసిందని.. సుప్రీంకోర్టులోనూ స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. బ్యారేజీ నిర్వహణపై నియమించే పర్యవేక్షక కమిటీపై ఒడిశాకు అభ్యంతరాలున్నందున.. ఈ విషయాలను చర్చించుకుందామని ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. వంశధారపై సరైన నీటి ప్రాజెక్టులు లేనందున దాదాపు 80టీఎంసీల నీరు ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా వెళ్లిపోతోందని.. రెండు రాష్ట్రాల రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. వంశధార ట్రైబ్యునల్ తీర్పును ఒడిశా రాష్ట్ర గెజిట్లో ప్రచురించి.. బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: