'అభయం' ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ఈ యాప్‌ను సీఎం విడుదల చేశారు. ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణకు ఈ ప్రాజెక్టును రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలివిడతగా విశాఖలో వెయ్యి ఆటోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి లక్ష ఆటోలకు విస్తరించనున్నామని చెప్పారు.
ఆటోలు, క్యాబ్‌లలో 'అభయం' ప్రాజెక్టు కింద ప్రత్యేక పరికరాలు రూపొందిస్తున్నామన్న సీఎం.. అభయం ప్రాజెక్టును రవాణా శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. వాహనాల్లో సురక్షిత ప్రయాణానికి 'అభయం' ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణంలో మహిళలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే పానిక్ బటన్ నొక్కాలన్నారు. ఉబర్, ఓలా ఆటోలు, ట్యాక్సీల్లోనూ ఇదే తరహా పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
'దిశ'ను పోలీసు శాఖ నిర్వహిస్తే, అభయంను రవాణాశాఖ నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్న జగన్.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం 'దిశ' బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 'దిశ' యాప్ ద్వారా మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్తగా 'అభయం' ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామని.. ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణకు రూపొందించిన ప్రాజెక్టు ఇదని పేర్కొన్నారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశాం. దేశంలోనే తొలిసారిగా 'దిశ' బిల్లును రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ప్రతి జిల్లాలోనూ దిశ పోలీసుస్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశాం. 'దిశ' చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నాం. మహిళలకు తోడుగా ఉండేలా 'దిశ' యాప్ తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణకు ఈ అభయం ప్రాజెక్టును రూపొందించాం- ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి: